వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని, ఇటీవల – జగన్ ని కానీ పవన్ కళ్యాణ్ ని కానీ తన నియోజకవర్గంలో వచ్చి పోటీ చేస్తే వారిని ఓడించి చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలేమనుకుంటున్నారో నని “పబ్లిక్ టాక్” తీసుకోవడానికి ఒక ఛానల్ ప్రయత్నించింది. ఆ పబ్లిక్ టాక్ లో మాట్లాడిన వాళ్లంతా చింతమనేని వ్యాఖ్యలను ఖండించారు
చింతమనేని ఎంపీటీసీగా మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా రాజకీయాల్లో ఎదుగుతూ ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గ విస్తరణ సమయంలో చింతమనేనికి చోటు కల్పించకపోవడంతో సొంత పార్టీ అధినేతపై కూడా విరుచుకుపడ్డాడు చింతమనేని. పార్టీకి రాజీనామా చేసి తానే సొంతంగా పార్టీ పెట్టి చూపిస్తానని కూడా అప్పట్లో సవాలు చేశాడు కానీ ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు విరమించుకున్నాడు. ఇక మహిళ ఎమ్మార్వో పై దాడి చేసి ఈ శిక్ష అనుభవించకుండా బయట తిరుగుతున్నాడు అని కూడా ప్రత్యర్థి పార్టీలు ఆయనను విమర్శిస్తూ ఉంటాయి. అలాగే ఆయనపై కోర్టులో కేసు ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. ఇక ఆ మధ్య బస్సు పై చంద్రబాబు నాయుడు ఫోటో లేదని ఆర్టీసీ డ్రైవర్ మీద చింతమనేని విరుచుకుపడిన విషయం తెలిసిందే.
పబ్లిక్ టాక్ లో మాట్లాడిన ప్రజలు ఈ విషయాలన్నీ గుర్తుచేశారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన దగ్గర డబ్బు లేకపోతే మిగతా నాయకులు చాలామంది చందాలు వేసుకొని ఆయనను గెలిపించిన విషయం గుర్తు చేస్తూ, అలాంటి వ్యక్తి ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే తానే సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్రమంతా పోటీ చేసే స్థాయికి ఎదిగాడని, ఎంత అవినీతి చేస్తే అంత సంపాదించాడని ప్రశ్నించారు. ఒకవైపు నియోజకవర్గంలోని గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా, వర్షాలకు ఇళ్లల్లోకి నీరు వచ్చి ఆ నీళ్లతో పాటు తేళ్ళు, పాములు ఇంట్లోకి వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, వాటిని గురించి పట్టించుకోకుండా ఎమ్మెల్యే చింతమనేని రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు అని మరికొందరు విమర్శించారు. ఇంకొంతమంది అయితే నీ మీద నడుస్తున్న కోర్టు కేసు ఫలితం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి అసలు నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో , ఈ సారి ముఖ్యమంత్రి గారు నీకు టికెట్ ఇస్తారో ఇవ్వరో, ముందు అది చేసుకోవాలని ఎమ్మెల్యేకి హితవుపలికారు.
ఏది ఏమైనా ఇలాంటి వివాదాలకి వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే చింతమనేని ఈ విషయాలన్నీ పట్టించుకుంటారని కూడా అనుకోలేం.