తోకపాయె కత్తి వచ్చె టాంటాంటాం.. కత్తిపాయె డోలు వచ్చె టాంటాంటాం.. అని పాడుకుంటూ వెళ్లే కోతి కథ గుర్తుకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల నీతిమాలిన వ్యాపారాలు, నిబంధనలకు నీళ్లొదిలేడానికి సంబంధించి.. ఇటీవల సంచలనంగా తెరమీదకు వచ్చిన వ్యవహారం.. విజయవాడలో బార్లోకల్తీ మద్యం తాగి పలువురు మరణించడం. ఈ వ్యవహారంలో కీలక నిందితుడుగా బార్ బినామీ యజమానిగా తెరమీదకు వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కానీ తాజా పరిణామాల్లో.. కల్తీ మద్యం వ్యవహారంలో విష్ణు పాత్ర ఎంత, నేరం ఎంత అనే సంగతి వెనక్కు వెళ్లి.. ఆయన అక్రమాస్తులు ప్రధానంగా తెరమీదకు వచ్చాయి. కల్తీ మద్యం కేసులో నిందితుడిగా అరెస్టు చేసి.. విష్ణును విచారించిన.. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. ఆయనకు 600 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు ఉన్నాయంటూ లెక్క తేల్చడం.. ఆ కేసు కొత్తగా తెరమీదకు రావడం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తాజా సంచలనంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సంబంధించి.. కల్తీ మద్యం కేసు కాస్త వెనక్కుపోయినట్లే! గీతను చెరపకుండా చిన్నది చేయడానికి, దాని పక్కన పెద్దగీత గీసినట్లుగా ఇప్పుడు 600 కోట్ల అక్రమాస్తుల వైనం వెలుగులోకి వచ్చింది. ‘నాకు అంత ఆస్తులు లేవు. ప్రభుత్వం నా మీద కక్ష సాధిస్తోంది’ అంటూ విష్ణు అంటున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రతిస్పందన మామూలే!
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే మీద కక్ష సాధించేంత శ్రద్ధ పాలకపక్షానికి ఉంటుందా? అనే మీమాంస ఒకవైపు వినిపిస్తోంది. అదే సమయంలో.. కాంగ్రెస్ నాయకుడిగా ఆయన మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనడం కంటె.. రాజకీయంగా నిత్యం ఉద్రిక్త పరిస్థితులే ఉండే విజయవాడ లోకల్ పాలిటిక్స్ నేపథ్యంలోనే.. విష్ణు ఇంత లోతుగా ఇరుక్కుపోయారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
కల్తీ లిక్కరు పోయి.. అక్రమాస్తుల కేసు తెరమీదకు వచ్చింది.. ముందు ముందు ఇంకా ఎన్ని రకాల పర్యవసానాలు ఉంటాయోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.