తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…మంత్రివర్గ సహచరులందరితో బుధవారం అత్యవసరంగా సమావేశం అవుతున్నారు. ఎక్కడెక్కడున్న వారంతా ఉన్న పళంగా… బుధవారం సమావేశానికి హాజరు కావాలని సందేశం పంపించారు. దీంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా హడావుడి పెరిగింది. కొద్ది రోజుల కిందట.. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశాన్ని ఇంతే హడావుడిగా ఏర్పాటు చేసిన కేసీఆర్… ముందస్తు, వెనకస్తు ఎన్నికలు లేవని సూటిగా చెప్పారు. కానీ ఆరు నెలలు ముందుగా ఎన్నికలు వస్తాయని సుత్తి లేకుండానే వివరించారు. దాంతో కేసీఆర్ ఏం చెప్పారో అర్థం చేసుకున్న నేతలు ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రారంభించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.. కచ్చితంగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. అంటే కేసీఆర్ గవర్నర్‌కు రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు చేస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే… మంత్రులందర్నీ అత్యవసర సమావేశానికి పిలవడంతో… అసెంబ్లీ రద్దుకు సంబంధించిన కీలక నిర్ణయంపై చర్చించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వారం చివరిలోనే పార్లమెంటరీ, ఎల్పీ సమావేశం జరగనుంది. అలాగే వచ్చే నెల 4న హైదరాబాద్ శివారులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి సమావేశంలో రాజీనామాపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుని వచ్చే నెల నాలుగో తేదీన ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్, డిసెంబర్లలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితో పాటే… తెలంగాణకూ ఎన్నికలు నిర్వహింప చేసుకోవాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. అలా చేయాలంటే.. వీలైనంత త్వరగా అసెంబ్లీని రద్దు చేయాలి.. లేకపోతే.. ఈసీ తేడా నిర్ణయం తీసుకుంటే టీఆర్ఎస్ భవిష్యత్ అంధకారమవుతుంది. అందుకే ఇప్పటికే కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ.. ఆ మేరకు.. తమకు అనుకూల నిర్ణయం వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి కేసీఆర్.. పార్లమెంట్‌తో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు.