‘సైరా’ బడ్జెట్ ఎంత? టీజర్ విడుదల కార్యక్రమంలో ఈ ప్రశ్నకు రామ్‌చరణ్ సూటిగా సమాధానం చెప్పలేదు. “నాన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఖర్చుకి వెనుకా ముందూ చూడట్లేదు. భారీగా తీస్తున్నాం. లాభాలు వస్తే బోనస్. రాకున్నా ఆనందమే. (‘మగధీర’ చూశాక..) నాన్నగారు నాతో ‘నీ (చరణ్)మీద నాకు ఏదైనా ఈర్ష్య వుందంటే.. రెండో సినిమాకి సోషియో ఫాంటసీ కాస్ట్యూమ్ డ్రామా చేశావ్. 35 ఏళ్లలో 150 సినిమాలు చేశా. నాకు ఒక్క సోషియో ఫాంటసీ కాస్ట్యూమ్ డ్రామా లేదురా’ అన్నారు. ఆయన కోరికకు సమాధానమే ఈ సినిమా. నాన్న కలను నిజం చేస్తున్నా” అని రామ్‌చరణ్ చెప్పాడు.
అల్లు అర్జున్ మాత్రం ‘సైరా’ బడ్జెట్ ఎంతో బయటపెట్టాడు. అభిమానుల నడుమ జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో ‘సైరా’ బడ్జెట్ గురించి బన్నీ మాట్లాడాడు. “చిరంజీవిగారి 150వ సినిమా (ఖైదీ నంబర్ 150) ఎంత కలెక్ట్ చేసిందో… దానికి రెండురెట్లు ఈ సినిమా (సైరా) బడ్జెట్ వుంటుంది. ఖర్చుకు వెనుకాడకుండా అంత భారీగా తీస్తున్నందుకు నిర్మాత రామ్‌చరణ్‌ని అభినందిస్తున్నా” అని అల్లు అర్జున్ చెప్పాడు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అల్లు అర్జున్ మాటలను బట్టి ‘సైరా’ బడ్జెట్ 200 కోట్ల రూపాయలు అనుకోవాలి.