రాజు మెచ్చింది రంభ… అని మన పెద్దవాళ్లు ఎన్నడో చెప్పారు. ఆ సామెత ఎంత గొప్ప అక్షర సత్యమో ఇప్పుడు కూడా సమకాలీన రాజకీయ పరిణామాలకు అచ్చు గుద్దినట్లుగా సరిపోవడాన్ని గమనిస్తే మనకు అర్థం అవుతుంది. సమర్థత, అసమర్థతలతో నిమిత్తం లేదు.. రాజు మెచ్చిన వాడే గొప్ప సారధి. రాజు గారి బిడ్డను ముద్దు చేయడానికి అందరూ తెగ ముచ్చట పడిపోతారన్నట్లుగా.. రాజుగారు మెచ్చిన సారధిని నెత్తిన పెట్టుకోవడానికి కూడా పార్టీ శ్రేణులు మొత్తం అత్యుత్సాహం కనబరుస్తుంది. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకా అనుకుంటున్నారా? దేని గురించి అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా గత ఏడాదిన్నర కాలంలో నిర్వహించిన అధికారాల సమయంలో పార్టీ కి దోహదపడేలా సాధించింది.. ఏదీ లేకపోయినప్పటికీ.. ఆయనను మించిన ఘనుడు మరొకరు లేరన్నట్లుగా.. మళ్లీ పార్టీ పగ్గాలు అందుకోవడానికి సిద్ధం అవుతున్న అమిత్ షా గురించి.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిపూజ ఎక్కువ. అమ్మ తలచుకుంటే.. చాలు.. ఆ నిర్ణయాలను శిరసావహించి.. కార్యరూపంలో పెట్టడానికి పార్టీ శ్రేణులంతా స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాయనే సంగతి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ లక్షణాలను పుణికిపుచ్చుకుంటున్న భాజపా కూడా… స్వామిని మించిన స్వామిభక్తిని ప్రదర్శించడంలో తామెవ్వరికీ తీసిపోం అని చాటుకుంటూ ఉన్నది. అందుకే ఇప్పుడు పార్టీ ని తన కనుసన్నల్లో నడిపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత ఇష్టుడైన అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవీకాలం పూర్తయిపోయినప్పటికీ.. మళ్లీ ఆయననే అదే గద్దెపై అందరూ కంకణం కట్టుకుని మరీ కూర్చోబెట్టేశారు.
మరింత లోతుగా పరిశీలిస్తే.. అమిత్ షా అనే నాయకుడు మోడీకి అత్యంత ఇష్టుడు, విశ్వాసపాత్రుడు, అనుంగు సహచరుడు అనే ముద్రతోనే తొలినుంచి అమిత్ షా చెలరేగుతున్నారు. ఎన్నడో గుజరాత్ లో మోడీ గెలవడానికి కీలకంగా వ్యవహరించాడని, యూపీలో, వారణాసిలో పార్టీ విజయానికి నికార్సయిన స్కెచ్ లు వేసిన మేధావి అని ఆయనకు కీర్తిని కట్టబెట్టారు. ఆ విజయాలనే స్మరించుకుంటూ.. మొత్తం పార్టీ సారథ్యాన్ని షా చేతుల్లో పెట్టారు. పార్టీలో సీనియర్లను లూప్ లైన్లోకి నెట్టడం దగ్గరినుంచి.. అనేక కీలక నిర్ణయాల్లో అమిత్ షా అమితంగానే జోక్యం చేసుకుంటున్నారనే అపకీర్తి ఉండనే ఉంది. అధ్యక్ష పదవిని మళ్లీ దక్కించుకున్న అమిత్ షా ఈ ఏడాదిలో.. భాజపాకు అనుకూలత లేని రాష్ట్రాల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఆ తర్వాత.. ఆయన సారథ్యం అనేది డొల్లతనమో, నిజంగా వ్యూహ చాతుర్యమో బయటపడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.