తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే అంశంపై నేతలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. పార్టీలో సరైన నాయకులు ప్రస్తుతం లేకపోయినా, క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు, తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలీ, ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరించాలనేది తనకు తెలుసునని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు సమాచారం. రాష్ట్రంలో త్వరలోనే ఓ ఐదు భారీ బహిరంగ సభలు నిర్వహించాలనే ప్రతిపాదన ఈ సమావేశంలో వచ్చినట్టు సమాచారం.
తెలంగాణ టీడీపీ నేతలతో త్వరలోనే చర్చిస్తాననీ, అక్కడి పార్టీ పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డట్టు సమాచారం. ముందుగా టీ టీడీపీ నేతలతో త్వరలోనే భేటీ అవుతానన్నారు. ఈ మధ్య కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న వైఖరి వల్ల టీడీపీకి కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయనే అభిప్రాయాన్ని ఈ సమావేశంలో ఒక నాయకుడు చెప్పారు. ప్రత్యేక హోదా, ఏపీ విభజన హామీల అంశంమై జాతీయ స్థాయిలో టీడీపీ పోరాటం చేస్తుంటే… తెరాస ఎంపీలు అనుసరించిన వైఖరి తెలిసిందే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అది తమకు అవసరం లేని వ్యవహారంగా ఆ పార్టీ ఎంపీలు వ్యవహరించడం వంటి పరిణామాలను తెలంగాణలోని సీమాంధ్రులు క్షుణ్ణంగా గమనించారనీ, రాష్ట్రంలో టీడీపీకి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందనే విశ్లేషణ జరిగినట్టు సమాచారం.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏయే పార్టీలతో సర్దుబాటు చేసుకోవాలి, పొత్తులు ఎలా ఉండాలనే అంశంపై కూడా నేతలు తమ అభిప్రాయాలను చంద్రబాబుతో పంచుకున్నారు. పొత్తుపై కూడా త్వరలోనే ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. సరైన సమయంలో సరైన చర్చకే చంద్రబాబు తెర లేపారని చెప్పుకోవాలి. ఎందుకంటే, తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటనేది ఉన్న ఆ కొద్దిమంది నేతలకు కూడా అర్థం కానట్టు తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీకి కొంత గ్రిప్ ఉన్నమాట వాస్తవమే. కానీ, ఆ స్థాయిలో సమన్వయం చేసే నాయకులు ఎవరున్నారనేదే పెద్ద ప్రశ్న. తెలంగాణలో టీడీపీకి కొంతమంది నేతల అవసరం కూడా ఉంది! ఈ దిశగా ద్వితీయ శ్రేణిలో ఉన్నవారికి అవకాశం కల్పిస్తారా, వలసలపై ఆధారపడతారా అనేది వేచి చూడాలి.