కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.దీనిపై ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. నిజానికి రాజకీయాల్లో పొత్తులు అనేవి కామన్. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా విమర్శలు చేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ.. శాశ్వత శత్రువులు ఉండరని రాజకీయంలో ఓ నానుడి. అది రాజకీయ పార్టీల పొత్తుల నుంచే వచ్చింది.అయితే తెలుగుదేశం పార్టీ సంప్రదాయకంగా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అని అంటూ ఉంటారు. కానీ యునైటెడ్ ఫ్రంట్ హయాంలో… దేవేగౌడ ప్రధాని అయినప్పుడు ఆ ఫ్రంట్ కు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ యునైటెడ్ ఫ్రంట్ కు కన్వీనర్ గా ఉన్నది చంద్రబాబునాయుడు. అంటే.. అప్పుడు రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నట్లే కదా..!
రాజకీయ అవసరాల మేరకే పొత్తులు..!
రాజకీయాల్లో పొత్తులనేది.. ఓ పార్టీ పట్ల అనుకూలత, వ్యతిరేకత లేని సైద్ధాంతిక అంశం. ఇవాళ రాజకీయాల్లో సైద్ధాంతికతలు లేవు. రాజకీయ అవసరాల కోసం… పొత్తులు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సమయంలో.. తెలుగుదేశం పార్టీ ఓ బలమైన శత్రువు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏపీలో టీడీపీ ప్రధాన ప్రత్యర్థి… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాటంప్పుడు కాంగ్రెస్ ప్రధాన శతృవు కావడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ తో పోటీ లేనప్పుడు… ప్రత్యర్థి కానప్పుడు… ఆ పార్టీని శతృవుగా చూడాల్సిన అవసరం టీడీపీకి లేదు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్తో పొత్తు ఎలా పెట్టుకుంటారని మరో విమర్శ. ఆ మాటకొస్తే… బీజేపీ మద్దతు లేకుండా… ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ విభజించగలదా..?. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో.. బీజేపీ పాత్ర కూడా అంతే ఉంది. ఇదేవరో ప్రతిపక్ష నేతలు చెప్పిన మాట కాదు… స్వయంగా బీజేపీ నేత సుష్మస్వరాజ్ చెప్పిన మాట. మీరు పెద్దమ్మనే కాదు.. ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోవాలని.. పార్లమెంట్ లోనే… తెలంగాణ ఎంపీలను సుష్మస్వరాజ్ కోరారు.
బీజేపీ, టీఆర్ఎస్ను ఓడించడానికే కాంగ్రెస్తో పొత్తు..!
రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఇదేమీ కొత్త పొత్తు కాదు. ఇదే కాదు.. 2009లో అసలు రాష్ట్రాన్ని విభజించడానికి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అసలు రాష్ట్రాన్ని విభజించడానికి కారణం ఎవరు అన్న చర్చ పెట్టుకుంటే.. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు..కారణమే. ఒక్క సీపీఎం మినహా అన్ని పార్టీలు… విభజనకు మద్దతు ఇచ్చాయి. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే ఎలా ప్రశ్నిస్తారు..?. తెలంగాణలో టీడీపీ మనుగడ సాగించాలంటే.. ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే.. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో టీఆర్ఎస్ సన్నిహితంగా వ్యవహరిస్తోంది.బీజేపీని ఓడించాలంటే… ఆ పార్టీకి మిత్రులుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకూడదనే ఆలోచన టీడీపీ నాయకత్వం చేస్తోంది. టీఆర్ఎస్ ను ఓడించడానికైనా… కాంగ్రెస్ తో కలవాలనే వాదన టీడీపీ ప్రారంభించే అవకాశం ఉంది. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తును సమర్థించుకోవడానికి ఓ ప్రాతిపదిక ఏర్పడింది.
ఏపీలో ప్రత్యేకహోదా ఇస్తానంటున్న కాంగ్రెస్తో పొత్తు..!
ఇక ఆంధ్రప్రదేశ్ లో మరో వాదన తీసుకొచ్చారు. బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వనంటోంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటోంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. బీజేపీ ఇవ్వనంటోంది. అంటే కేంద్రం సాయం లేకుండా.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా రాదు. కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వనని తేల్చేసింది. ఇతర కూటములు ఇంకా ఉనికిలోకి రాలేదు. అంటే… ఇప్పుడు ఉన్న అవకాశం… కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తానంటోంది కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామనే వాదనను.. చంద్రబాబు తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భావన ఉంది. ఆ మూడు రాష్ట్రాల్లో గెలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వేవ్ వస్తుంది.కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పలేకపోయినా.. వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు చంద్రబాబు పని మరింత సులువు అవుతుంది.
ఏపీ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్తో స్నేహం..!
2014లో రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నా కూడా ప్రజలు ఆదరించారు. ఎందుకంటే.. కొత్త రాష్ట్రం నిలబడాలంటే… కేంద్రం సహకారం అవసరం కాబట్టి.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు ప్రచారం చేశారు. దానికి ప్రజలు కూడా ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ప్రయోగం చేయబోతున్నారు. జాతీయ స్థాయిలో మనకు మిత్రులు కావాలి.. కేంద్రంలో అధికారంలో ప్రభుత్వంతో మనకు అవసరాలు ఉంటాయి… అందుకే కేంద్రంలో అధికారంలోకి వచ్చేవారి గత చరిత్ర ఎలా ఉన్నా.. వారితో సఖ్యతగా ఉండి.. ఏపీ ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే ముఖ్యమనే వాదనను… టీడీపీ ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. 2014లో బీజేపీతో పొత్తుకు.. ఎలాంటి వాదన వినిపించారో.. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు కోసం అదే ప్రాతిపదికగా చెప్పనున్నారు.
అంతిమంగా రాజకీయ ప్రయోజనం ఉంటేనే పొత్తులు..!
కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు గతంలో చేసిన విమర్శలను కొంత మంది ప్రస్తావిస్తున్నారు.కానీ నిజానికి గతంలో బీజేపీతో చంద్రబాబు కటిఫ్ చెప్పినప్పుడు.. బీజేపీతో ఇక కలిసే ప్రసక్తే లేదని ప్రకటించారు. అప్పట్టో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీపై తీవ్రమైన విమర్శలు చేశారు. అలాంటి మోడీతో.. అలాంటి బీజేపీతో 2014కి వచ్చే సరికి మళ్లీ పొత్తులు పెట్టుకున్నారు. ఏపీ ప్రజల కోసం.. ఏపీ ప్రభుత్వ అవసరాల కోసం.. పొత్తులు పెట్టుకున్నారు. 2019లోనూ అదే జరుగుతోంది. రేపు కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశం ఉన్న వాదన తీసుకొచ్చి… కాంగ్రెస్ తో పొత్తు పెట్టే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే… ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య ఓటింగ్ నిట్ట నిలువుగా చీలింది.గత ఎన్నికల సమయంలో టీడీపీకి పొత్తులు కలిసి వచ్చాయి. ఈ సారి బీజేపీ, జనసేన దూరమయ్యాయి. దూరమైన ఓటింగ్ ఎక్కడ ప్లస్ అయితే.. అక్కడ చంద్రబాబు కలుపుకునే అవకాశం ఉంది. అందుల్ల రాజకీయంగా తనకు లాభదాయకం అయితే.. చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే విషయంలో ఆలోచించరు.