సింహరాశి అనే సినిమాలో… మద్దతు కోసం వచ్చిన రాజకీయ నేతలతో.. సమస్యలన్నీ పరిష్కరిస్తామనే బాండ్లు రాయించుకుంటాడు..హీరో రాజశేఖర్. గెలిచిన తర్వాత సమస్యలను పరిష్కరించకపోతే… నాలుక కోయడం.. చేతులు విరిచేయడం చేస్తూంటాడు. ఇదీ మరీ వయోలెన్స్ ఏమో కానీ… బాండ్లు రాసుకోవడం అనే కాన్సెప్ట్.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు బాగా నచ్చినట్లు ఉంది. దీన్ని ఇప్పుడు… తన జిల్లాల పర్యటనల్లో యువతకు చెబుతున్నారు. ఓట్ల కోసం వచ్చే నేతల వద్ద.. సమస్యలను పరిష్కరిస్తామనే హామీతో.. బాండ్లు తీసుకోమంటున్నారు.
రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలని …ప్రజలే మేనిఫెస్టో రూపొందించాలని సూచిస్తున్నారు. కొత్త ఆలోచనలు రేకెత్తించాలని తన పర్యటనల్లో చెబుతూ వస్తున్నారు. గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెట్టారు. యువత ముందుకొచ్చి తమగ్రామాల్లో ఎలాంటి అవసరాలు కావాలో మేనిఫెస్టో రూపొందించాలని చెబుతున్నారు. నాయకుల మెడలు వంచి పనులు చేయించుకోవాలంటున్నారు. వందరూపాయల బాండ్పేపర్లో అగ్రిమెంట్ రాయించుకోవాలని యువతను కోరుతున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్న లక్ష్మీనారాయణ …మేనిఫెస్టోలు ప్రజలు ఎలా రూపొందించాలో తర్ఫీదు ఇస్తున్నారు. నకలు కాపీలను ప్రజలకు పంచి తమ అవసరాలను రాయాలని కోరుతున్నారు.
రాజకీయ ఆలోచనల విషయంలో… లక్ష్మినారాయణ ఎక్కడా బయటపడటం లేదు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడుతానంటున్నారు. రాజకీయాల గురించి అప్పుడే నిర్ణయం తీసుకుంటానంటున్నారు. మరి రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న సమయంలో.. నిర్ణయాల్లో వేగం పెంచుతారేమో చూడాలి..!