‘ఏ మాయ చేసావె’ ప్రేక్షకుల ముందుకొచ్చి 8 ఏళ్ళు అయ్యింది. అందులో జెస్సి (సమంత) ప్రేమికుడిగా నాగ చైతన్య అక్కినేని, జెస్సి అన్నయ్యగా సుధీర్‌బాబు కొట్టుకున్నారు. జెస్సి ఎంత ప్రయత్నించినా ఇద్దరి మధ్య ఫైట్ తప్పలేదు. ఇన్నేళ్ల తరవాత చైతన్య, సుధీర్‌బాబు మధ్య మళ్లీ ఫైట్ తప్పట్లేదు. అయితే… సినిమాలో ఫైట్ కాదిది. థియేటర్ల దగ్గర ఫైట్! సుధీర్‌బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘నన్ను దోచుకుందువటే’ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు అదే తేదీకి నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. కేరళలో వరదల కారణంగా రీరికార్డింగ్ సకాలంలో పూర్తి కాలేదు. దాంతో చైతూ సినిమా వాయిదా పడింది. నిజానికి చైతూ కంటే ముందు ఈ డేట్ మీద సమంత కర్చీఫ్ వేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యు టర్న్’ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై సుధీర్‌బాబు ఫన్నీగా ట్వీట్ కూడా చేశాడు. “ఏళ్ళు గడిచినా జెస్సి, జెర్రీ ఫైట్ చేసుకుంటున్నారు. మా ఇద్దరి సినిమాలు సెప్టెంబర్ 13న విడుదల అవుతున్నాయి. ఆల్ ద బెస్ట్ టు సామ్” అని సుధీర్‌బాబు చెప్పాడు. అంటే… బ్రదర్ & సిస్టర్ ఫైట్‌లోకి చైతూ వచ్చాడన్న మాట! ఈ వినాయక చవితికి ముగ్గురూ కలిసి ఏ మాయ చేస్తారో చూడాలి.