తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరింత పతనావస్థకు చేరుకుంటున్నదా? ముందుముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసలు నాయకులు ఎందరో, కార్యకర్తలు ఎందరో వేళ్ల మీద లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితికి తెదేపా చేరుకుంటున్నదా? అంటే.. పార్టీ వర్గాల్లో మాత్రం అవుననే సందేహాలు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ ప్రభ మసకబారుతూ ఉండగా, అంతో ఇంతో బలం ఉందని వారు అనుకునే హైదరాబాద్ నగరంలో కూడా ఈ గ్రేటర్ ఎన్నికలు.. తెదేపా బలహీనతల్ని చాటుతున్నాయి. పార్టీ ఉపాధ్యక్షుడిగా కిరీటం కట్టబెట్టిన మాజీ మంత్రి కృష్ణయాదవ్ ఇవాళ తెరాసలో చేరుతుండడం అనేది నగర తెదేపా భవిష్యత్తుకు సంబంధించి చాలా కీలకమైన పరిణామంగా వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో మరో ట్విస్టు ఏంటంటే.. కృష్ణయాదవ్తో రాజీచర్చలు చేయాల్సిందిగా నారా వారు కోరినప్పుడు.. కృష్ణయాదవ్కు గురువులాంటి పెద్దదిక్కులాంటి వ్యక్తి అయిన నందమూరి హరికృష్ణ పట్టించుకోలేదని, స్పందించలేదని, తను జోక్యం చేసుకోను అని చెప్పారని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తలసాని శ్రీనివాసయాదవ్ తెలుగుదేశం పార్టీని వీడిపోయిన తర్వాత.. భాగ్యనగరంలో బీసీలకు తమ పార్టీ ఎప్పటికీ కేంద్రబిందువే అని చెప్పుకోవడానికి తెలుగుదేశానికి కృష్ణయాదవ్కు మించి వేరే గత్యంతరం లేకుండా పోయింది. నిజానికి నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో జైలు పాలయి తిరిగి వచ్చిన కృష్ణయాదవ్ను ఆ సమయంలో పార్టీ దూరం పెట్టింది. అయితే నందమూరి హరికృష్ణ జోక్యం చేసుకుని, చంద్రబాబు మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన తర్వాతే.. కృష్ణయాదవ్ను తిరిగి పార్టీలో చేర్చుకుని సభ్యత్వం ఇచ్చారు.
అలాంటి కృష్ణయాదవ్ హరికృష్ణ దీవెనలతోనే పార్టీలో చెలామణీ అవుతూ వచ్చారు. కానీ కాలక్రమంలో హరికృష్ణకే ఠికానా లేకుండా పోయింది. అయినా.. తలసాని శ్రీనివాసయాదవ్ వెళ్లిపోయాక.. కృష్ణయాదవ్ పొజిషన్ పెరిగింది. ఆయన తెలంగాణ రాష్ట్ర పార్టీకి ఉపాధ్యక్షుడు అయ్యారు. అయితే.. గ్రేటర్ ఎన్నికల టికెట్ల పందేరం నేపథ్యంలో అలిగిన కృష్ణయాదవ్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ తెరాసలో చేరబోతున్నారు.
గతంలో ఆయన పార్టీలోకి రావడానికి తోడ్పడింది.. నందమూరి హరికృష్ణ గనుక.. ఇప్పుడు ఆయన పార్టీని వీడిపోకుండా బుజ్జగించాల్సిందిగా హరికృష్ణను తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న నారా లోకేష్ కోరారని, అయితే అందుకు హరికృష్ణ తిరస్కరించారని సమాచారం. మీరు నా వాళ్లను ఛీత్కరిస్తూ పోతూంటే.. నేను బుజ్జగిస్తూ తీసుకువస్తుండాలా? వాళ్ల భవిష్యత్తు వాళ్లు చూసుకుంటారు? అనే అభిప్రాయంతో హరికృష్ణ నారా వారి విజ్ఞప్తిని తోసిపుచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కృష్ణయాదవ్ కూడా వెళ్లిపోవడం ఒక వర్గం బీసీల్లో పార్టీ ఇమేజీకి దెబ్బే అని పలువురు అంటున్నారు.