కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపు ఖాయమేనని పలు మీడియా సంస్థలు పత్రికలు చెబుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని, ఉండకూడదని తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాస్త తీవ్రమైన పదజాలంతో నే వీరు విమర్శించడం చూస్తుంటే, ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు ఖరారైతే తెలుగుదేశం పార్టీలో సమీకరణాలు మారిపోవచ్చు అని కూడా అనుమానాలు కలుగుతున్నాయి.
“దేశాన్ని దోచుకుని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపితే ప్రజలు బట్టలూడదీసి తంతారని,ఎన్టీఆర్ కాంగ్రె్‌సను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించా రని, ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదు, రాష్ట్ర ప్రజలు క్షమించరు, మా అధినేత చంద్రబాబు అటువంటి తప్పు చేస్తారని నేను భావించడం లేదని, రాజకీయంగా ఎంతో కీలకమైన ఇటువంటి అంశాన్ని పొలిట్‌బ్యూరోలో చర్చించకుండా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం లే దని”, రహదారులు-భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్, ప్రధాని మోదీ, వైసీపీ అధ్యక్షుడు జగన్ మాకు బద్ధశత్రువులు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తేలేదు’ అని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.
ఇద్దరు మంత్రులు కూడా – ‘దుర్మార్గం’, ‘ బట్టలూడదీసి తంతా రు ‘ ‘బద్ధశత్రువులు’ లాంటి బలమైన పదాలు ఉపయోగించి ఈ పొత్తును ఖండించడం చూస్తుంటే, ఒకవేళ పొత్తు ఖాయమైతే గనక తెలుగుదేశం పార్టీలో సంచలనాత్మక పరిణామాలు ఉండవచ్చని భావించాల్సి ఉంటుంది.