అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీ పెట్టబోతున్నారని.. మూడు, నాలుగు నెలల కిందట నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని కొత్తపల్లి గీత నిజం చేశారు. జన జాగృతి పార్టీని ప్రకటించారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ప్రజల కోసమే పార్టీని పెట్టానని ప్రకటించారు. గొడుగు గుర్తును తన పార్టీ కోసం ఎంచుకున్నారు. వైసీపీ తరపున అరకు నుంచి ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. మధ్యలో.. తెలుగుదేశం పార్టీలో చేరుతారని.. ప్రచారం జరిగింది. ఆ తర్వాత బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని చెప్పుకున్నారు. చివరికి కొత్త పార్టీ పెట్టుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కొత్తపల్లి గీత.. ప్రభుత్వ అధికారిగా పని చేశారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉండి పదవికి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు. హైదరాబాద్ శివార్లలో ఆర్డీవోగా ఉన్నప్పుడు.. ప్రభుత్వ భూమిని తన భర్త సంస్థకు రాసిచ్చేశారన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసేసుకుంది. అయితే.. అప్పటికే ఆ భూమిని బ్యాంకుల్లో పెట్టి.. వందల కోట్లు అప్పులు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో.. బ్యాంకులు.. సీబీఐకి ఫిర్యాదు చేశాయి. కొత్తపల్లి గీత దంపతులపై సీబీఐ కేసు నమోదయింది. సమన్లు కూడా జారీ అయ్యాయి. అప్పుడే ఆమెకు వ్యక్తిగత హోదాలో రెండు పాన్‌కార్డులు ఉన్నట్లు బయటకు వచ్చింది.
ఆ తర్వాత సీబీఐ విచారణకు వెళ్లారో లేదో కానీ… కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. పార్లమెంట్లో వివిధ సందర్భాల్లో కేంద్రానికి అనుకూలంగా మాట్లాడారు. ప్రధానితో రెండు, మూడు సార్లు సమావేశై.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. కొత్తపల్లి గీతకు ఎస్టీ సర్టిఫికెట్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఏపీ ప్రభుత్వం విచారణ జరిపి ఆమె ఎస్టీనే అనే సర్టిఫికెట్ ఇచ్చిది. ఏపీలో అధికార పార్టీని దెబ్బకొట్టడానికి వీలైనన్ని పార్టీలు పెట్టించాలనే వ్యూహాన్ని.. బీజేపీ అమలు చేస్తోందని… కొన్నాళ్ల క్రితం.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు ఆర్టికల్‌లో రాశారు. అప్పుడే.. కొత్తపల్లిగీత బీజేపీ ప్రొద్భలంతో కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడది నిజమయింది.