తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5
నీకు 360 డిగ్రీస్ మృత్యువును చూసిస్తా…అంటూ ఈ సినిమాలో నారా రోహిత్‌కు జగపతిబాబు ఎప్పుడూ హెచ్చరికలు జారీచేస్తుంటాడు. అది `ఆటగాళ్లు` చూసే ప్రేక్షకులకు కూడా వర్తిస్తుందని అర్థమవడానికి ఎంతో సమయం పట్టదు. ఆటగాళ్ల ఆటేమిటో చూద్దామని ఆత్రుతగా వెళ్లిన ప్రేక్షకులు సినిమాలో సన్నివేశాల్ని చూస్తున్నప్పుడు సరైన హెల్మెట్, గార్డ్ లేకుండా భీభత్సమైన ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నట్టు, పారాచ్యూట్ లేకుండా విమానం నుంచి ఎవరో గెంటి వేసినట్లు భయానక అనుభవానికి గురవుతారు. కోమాలోకి వెళ్లిన చిన్నారి ఓ చిన్న ట్యాబ్లెట్ (అది ఓ మింట్లాంటి ఓ పిప్పర్మెంట్)తో స్పృహలోకి రావడం చూస్తుంటే కాకలుతీరిన శాస్త్రఘ్నులు కూడా కకావికలమై పోవాల్సిందే. జేబులో నాలుగు పిప్పర్మెంట్ బిళ్లలు తోడుంటే కోమానైనా ధీమాగా ఎదుర్కోవచ్చనే ఓ పిచ్చి ధైర్యం వస్తుంది. కోపంతో ఓ హత్య చేసిన మన హీరో నారా రోహిత్…ఇమేజ్ కోసం సింపుల్‌గా భార్యను కూడా హతమారుస్తాడు. ఇమేజ్ కోసం లైఫ్‌ను ఇంత డ్యామేజ్ చేసుకుంటారా అనే సందేహం వస్తే అది ప్రేక్షకుల తప్పుకాదు. సినిమాలో అతిశయోక్తులు, సృజనాత్మక సేచ్ఛ ఉండటం తప్పు కాదు..కానీ అతిశయోక్తులన్ని కట్టకట్టుకొని పిరానా చేపల్లాగా ప్రేక్షకుల మీద దాడి చేస్తే ఎలా వుంటుందో ఆటగాళ్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక ఆలస్యమెందుకు ఆటగాళ్లు ఏ రేంజ్లో ఆడారో (ఆడుకున్నారో) తెలుసుకోవాలంటే కథ ఏమిటో తప్పనిసరి పరిస్థితుల్లో తెలుసుకోవాల్సిందే..
కథ
టాలీవుడ్లో అగ్రశ్రేణి దర్శకుడైన సిద్దార్థ్ (నారా రోహిత్) తనకు ఓ సినిమా విషయంలో పరిచయమైన అంజలిని (దర్శన బానిక్)ను ప్రేమించిపెళ్లాడుతాడు. ఓ రోజు అంజలి ఇంటిలోనే అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవుతుంది. ఈ కేసును సిటీలోనే పేరొందిన, అత్యంత నిజాయితీపరుడైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతిబాబు) టేకాఫ్ చేస్తాడు. హత్య జరిగిన రోజు సీసీ టీవీ ఫుటెజ్ల ఆధారంగా సిద్ధార్థే హత్యకు పాల్పడ్డాడని వాదిస్తాడు. కోర్ట్ సిద్దార్థ్‌ను విచారణ నిమిత్తం జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాయక్ ( సుబ్బరాజు), వీరేంద్ర సమక్షంలో సిద్ధార్థ్‌ను విచారిస్తారు. నాయక్ అందించిన సమాచారంతో హత్యకు పాల్పడింది సిద్ధార్థ్ కాదని, అంజలిని కాలేజీ రోజుల్లో వేధించిన మున్నా అని వీరేంద్ర తెలుసుకుంటాడు. దీంతో సిద్దార్థ్‌ను నిర్ధోషిగా భావించి అతని తరపున కోర్టులో వాదిస్తాడు వీరేంద్ర. కోర్టు ముందుకు హాజరైన మున్నా కూడా తానే హత్య చేశానని ఒప్పకుంటాడు. దాంతో అతనికి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తుంది. కేసు ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో హత్య చేసింది మున్నా కాదని, డబ్బు ఆశచూపి అతన్ని బలవంతంగా కేసులో ఇరికించారని తెలుసుకుంటాడు వీరేంద్ర. తిరిగి విచారణ ప్రారంభించిన వీరేంద్రకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతాయి. అసలు అంజలిని హత్య చేసిందెవరు? మున్నాను కేసులోఎందుకు ఇరికించాల్సి వచ్చింది? ఈ కేసులో సిద్దార్థ్, వీరేంద్ర మధ్య ఎత్తుకు పై ఎత్తులతో సాగిన సమరమేమిటన్నదే చిత్ర ఇతివృత్తం..
విశ్లేషణ :
చెప్పుకోవడానికి అనుక్షణం ఉత్కంఠ, అనూహ్య మలుపులతో సాగే కథ అనిపిస్తుంది కానీ..తెరపై వచ్చే సరికి కథాగమనమంతా అగమ్యగోచరంలా అనిపిస్తుంది. కోపంతో తాను కారుతో ఢీకొట్టి చంపిన రైతు కూతురుని దత్తత తీసుకోవడానికి ముందుకొస్తాడు సిద్దార్థ్. అంతటి ఔదార్యాన్ని ప్రదర్శించే ఆ పాత్ర ఇమేజ్ కోసం భార్యను చంపడం, వీరేంద్రతో మైండ్‌గేమ్ ఆడటం, తనను అడ్డొచ్చిన వారిని క్రూరంగా అంతమొందించడానికి ప్రయత్నించడం ఏమాత్రం పాత్రోచితం అనిపించుకోలేదు. సిద్దార్థ్ పాత్ర చిత్రణలో లెక్కలేనన్ని లోపాలు కనిపిస్తాయి. ఇద్దరు తెలివైన వ్యక్తుల మధ్య మైండ్‌గేమ్‌తో ఎత్తుకు పై ఎత్తులతో సాగే కథలు గతంలో ఎన్నో వచ్చాయి. అయితే వీటిని ఎంత కన్విన్సింగ్‌గా, ప్రేక్షకుల ఊహకు అందకుండా తెరకెక్కిస్తామన్న దాని మీదే సినిమా విజయం ఆధారపడి వుంటుంది. ఆటగాళ్లు కథను చూసుకుంటే అడుగడుగునా లోపాలు కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ప్రేక్షకులు నోరేళ్లబెట్టాల్సిందే. కోమాలోకి వెళ్లిన చిన్నారి చిన్న మాత్రతో స్పృహలోకి రావడం, మరో మాత్ర వేయగానే నిద్రలోకి జారుకోవడం కృతకంగా అనిపిస్తుంది. కొంచెం కామన్సెన్స్ ఉపయోగిస్తే ఇలాంటి సన్నివేశాల్ని చూసి ప్రేక్షకుల నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయో అర్థం చేసుకోవచ్చు.
కోపంతో, ఇమేజ్ పట్టింపుతో హత్యలు చేసే సిద్ధార్థ్ నిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించడు. అలాంటి పాత్రకు కొన్ని సన్నివేశాల్లో ఉదాత్తంగా చూపించడం ఎందుకో అర్థం కాదు. ఇక సినిమా ప్రథమార్థంలో బ్రహ్మనందం, కథానాయిక, సిద్దార్థ్ మధ్య వచ్చే సన్నివేశాలు హాస్యాన్ని పండిచక పోగా విసుగెత్తిస్తాయి. బ్రహ్మనందం వంటి టాప్ కమెడియన్ కూడా సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోవడంలో దర్శకుడు వైఫల్యం కనిపిస్తుంది. ప్రథమార్థం అంతా కంగాళీ సన్నివేశాలతో సాగింది. ద్వితీయార్థంలోనే కథ ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. అంజలిని హత్య నేపథ్యంలో రూపొందించిన సన్నివేశాల వల్ల కథలో ఆసక్తి ఏర్పడుతుంది. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాల్లో కలిగించిన ఉత్కంఠతను చివరి వరకు కొనసాగించలేక పోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది. ఓ సందర్భంలో వీరేంద్ర…సిద్దార్థ్ ను తప్పుల్ని ఒప్పుకోమని ప్రాధేయపడటం, దానికి సిద్దార్థ్ కరిగిపోయి జరిగినదంతా చెప్పేయడం ఏ మాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. ద్వితీయార్థం ఆరంభంలోనే అంజలి హత్య రహస్యం తెలిసిపోవడంతో కథ ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు.
నటీనటులు :
ఇందులో నారా రోహిత్ పాత్ర ప్రతినాయక ఛాయలతో సాగుతుంది. అయితే పాత్ర తాలూకు కన్నింగ్‌నెస్‌ను, ఇంటెన్సిటీ ఆయనలో ఏమాత్రం కనిపించలేదు. స్వతహాగా చక్కటి ప్రతిభావంతుడైన నారా రోహిత్ పాత్ర ఈ సినిమాలో పేలవంగా అనిపిస్తుంది. అందుకు అతన్ని తప్పుపట్టలేం. కథలో వున్న లోపాల వల్ల ఆయన పాత్ర నిస్సారంగా సాగింది. సెకండ్ ఇన్సింగ్స్‌లో విలన్ పాత్రలు ఎక్కువగా చేస్తున్న జగపతిబాబు ఈ సినిమాలో సిన్సియర్ లాయర్‌గా చక్కటి పాత్రన చేశాను. యథావిథిగా తన పాత్రకు న్యాయం చేశారాయన. ఇక కథానాయిక దర్శన బానిక్ ఫర్వాలేదనిపించింది. ఇక చాలా విరామం తర్వాత తెరపై కనిపించిన బ్రహ్మానందం పాత్ర నిరాశపరుస్తుంది. ఆయనలో మునుపటి మ్యాజిక్ లోపించినట్టుగా అనిపించింది. తులసి తనదైన అభినయంతో మెప్పించింది. మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతికత :
సాయికార్తీక్ సంగీతం ఏమాత్రం బాగా లేదు. బ్యాక్‌గ్రౌండ్ కొన్ని సన్నివేశాల్లో ఫర్వాలేదనిపించింది. సాంకేతికంగా ప్రతి అంశంలోనూ లోపం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు నాసిరకంగా వున్నాయి. చాలాకాలం తరవాత మెగాఫోన్ పట్టిన పరుచూరి మురళి… ఈ కథని డీల్ చేయలేక చతికిలపడ్డాడు. దర్శకత్వలోపాలు అడుగడుగునా కనిపిస్తాయి.
తీర్పు :
ఏమాత్రం కొత్తదనంలేని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా సాగుతుంది. గత కొన్నిరోజులుగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్ననారా రోహిత్‌కు నిరాశ మిలిల్చే చిత్రమవుతుంది. కథాంశాల ఎంపికలో ఆయన పునఃపరిశీలన చేసుకోవాలనే అవసరాన్ని తెలియజెపుతుంది.
ఫైనల్ టచ్: ఆడేసుకున్నారు
తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5