తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందస్తుకు వెళ్తున్ననట్లు విస్పష్టంగా ప్రకటించారు. టీఆర్ఎస్ కు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలందరితో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ప్రగతి నివేదన సభతోనే ఎన్నికల భేరీ మోగిద్దామని పిలుపునిచ్చారు. దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది సభకు హాజరవబోతున్నారని… అందరూ సమష్టిగా పని చేసి సభను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం పాతిక వేల మంది తరలించాలని దిశానిర్దేశం చేశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల పనితీరుపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని… కేసీఆర్ సమావేశంలో వ్యాఖ్యానించారు. అయినా సరే.. అడ్డంకులన్నింటినీ అధిగమించి.. వంద సీట్లు గెలవబోతున్నామని.. కేసీఆర్ ప్రకటించారు.
ముందస్తుపై కేసీఆర్ నేరుగా … సమాచారం ఇవ్వడంతో… ఇప్పటి వరకూ.. ఉన్న ఏ మూలో ఉన్న అనుమానాలు.. టీఆర్ఎస్ క్యాడర్ కు తీరిపోయినట్లయింది. ముందస్తుపై స్పష్టమైన సందేశం ఇవ్వడానికే.. కేసీఆర్… కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనే కాకుండా.. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్న వారందరికీ సమాచారం పంపారు. ఇద్దరు ముగ్గురు ఉన్నా..అందర్నీ ఆహ్వానించారు. అందరికీ.. ప్రగతి నివేదన సభ విజయవంతం దిశానిర్దేశం చేసి.. ఆ సభతోనే ఎన్నికల భేరీ మోగిస్తున్నామని స్పష్టం చేశారు. ముందస్తుపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్…ఈ రోజంతా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితం విద్యుత్ ప్రకటించారు. ఆత్మగౌరవ భవనాలు కులాల భవనాలకు భూ కేటాయింపులు చేశారు. మౌజమ్ లు, ఇమామ్ లతు గౌరవ వేతనం 5 వేలకు పెంచారు. పూజారులు, ఆర్చకులకు ట్రెజరీ నుంచే ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. అర్చకుల పదవి విరమణ వయసు 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచారు.
మినీ గురుకులాల్లో సిబ్బంది వేతనాలు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మెప్మా రీసోర్స్ పర్సన్ లు గౌరవ వేతనాన్ని కూడా పెంచారు. కొత్తగా నేతలకు కార్పొరేషన్ పదవుల ఇచ్చారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేశారు. ఇక ఉద్యోగ నియామకాలకు అడ్డంకిగా ఉన్న.. కొత్త జోనల్ వ్యవస్థ ఆమోదం కోసం..కేసీఆర్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేయబోతున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి… తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను… కేంద్రం నుంచి సాధించాలనే పట్టుదలతో ఢిల్లీకి పయనమయ్యారు. నేరుగా మీడియా ముందు ప్రకటించకపోయినా… తీసుకుంటున్న నిర్ణయాలు.. అమలు చేస్తున్న వ్యూహాలు.. కేసీఆర్ ముందస్తు నిర్ణయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.