రాజకీయ చిత్రాలకు ప్రేక్షకాదరణ బావుంటోంది! అందులోనూ ముఖ్యమంత్రి నేపథ్యంలో వచ్చే చిత్రాలకు ఆదరణ మరింత బావుంది. ‘ఒకే ఒక్కడు’, ‘రంగం’, ‘లీడర్’, తాజా ‘భరత్ అనే నేను’ చిత్రాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అవన్నీ కల్పిత కథలు. ప్రస్తుతం నిజజీవిత ముఖ్యమంత్రుల కథలను కొందరు తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్’, వైయస్సార్ బయోపిక్ ‘యాత్ర’, కేసీయార్ బయోపిక్స్ ‘గులాల్’ ఒకటి, నాజర్ ప్రధానపాత్రలో మరొకటి మొదలయ్యాయి. ఇద్దరు ముగ్గురు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయ నేతల్లో బయోపిక్స్ వచ్చేసరికి అందరూ ముఖ్యమంత్రులను ఎంచుకుంటున్నారు. బట్ ఫర్ ఏ చేంజ్… దర్శకుడు ఎన్. శంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ని ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీయార్తో పాటు పోరాటాలు చేసిన ప్రముఖుల్లో జయశంకర్ ముఖ్యులు అని అందరికీ తెలిసిందే.
‘శ్రీ రాములయ్య’, ‘జయం మనదేరా’, ‘భద్రాచలం’, ‘జై బోలో తెలంగాణ’ వంటి చిత్రాల ఎన్. శంకర్ దర్శకత్వం వహించారు. తెలంగాణ సమాజంలో స్ఫూర్తి నింపే ప్రయత్నంలో భాగంగా జయశంకర్ సర్ బయోపిక్ తీయబోతున్నానని ఆయన తెలిపారు. మహాలక్ష్మి ఆర్ట్స్ సంస్థపై ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.