రోడ్డు మీద ఎవరైనా ప్రమాదానికి గురై కనిపిస్తే.. అంబులెన్స్ వచ్చే వరకూ చూడకుండా… వారిని తమ కార్లలోనే ఆస్పత్రికి తీసుకెళ్లే రాజకీయ నాయకుల గురించి తరచూ మీడియాలో చూస్తాం. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా అదే టైపు. కాకపోతే కాస్తంత తేడా ఉంది. ఆయన బాధితుల్ని ఆస్పత్రులకు తరలించే విషయాన్ని పట్టించుకోరు కానీ.. తాను మాత్రం అర్జంట్ గా ఓ కారు తెప్పించుని వెళ్లిపోతారు. ఆయన ఆ తరహా ప్రజాసేవ చేసే నాయకుడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది ఇదే.
తాను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. రోడ్డున పోయేవారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇద్దరిలో ఒకరు స్పాట్ లో చనిపోగా మరొకరు.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే.. దిగ్భ్రాంతికి గురైన జీవీఎల్… పోలీసులు కూడా రాక ముందే వేరే కారు తెప్పించుకుని అందులో వెళ్లిపోయారు. డ్రైవర్ ని మాత్రం అక్కడే ఉంచారు. జీవీఎల్ వెళ్లిపోయేటప్పటికీ.. అంబులెన్స్ కూడా ఇంకా రాలేదు. పోలీసులు వచ్చి విషయం తెలుసుకుని… డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కానీ బాధ్యతయుతమైన ఎంపీగా ఉండి.. తాను ప్రయాణిస్తున్న కారు వల్ల .. ప్రాణాలు కోల్పోయిన.. ప్రాణాలు కోల్పోయేంతగా గాయపడిన వారి గురించి కించిత్ ఆలోచించకుండా.. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించి.. చకచకా సర్దుకుని వెళ్లిపోయారు జీవీఎల్.
ప్రమాదానికి గురైన కారు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయం పేరిట రిజిస్టర్ అయి ఉంది. దానిపై ఎంపీ స్టికర్ కూడా అంటించి ఉంది. ప్రభుత్వాల బాధ్యతల గురించి… లెక్చర్లిచ్చే జీవీఎల్ కనీసం ఓ మానవత్వం ఉన్న మనిషిగా వ్యవహరించడానికి ముందుకు రాకపోవడం.. పలువుర్ని ఆశ్చర్య పరిచింది. మామూలుగా అయితే…ఇలా పాదచారులను ప్రమాదానికి గురి చేసినప్పుడు.. ఆయా కార్లలో ఉన్న వారిని పట్టుకుని చితక్కొట్టేస్తారు చుట్టుపక్కల జనం. కానీ జీవీఎల్ అదృష్టం బాగుంది..కొంత మంది తిట్లతోనే సరిపెట్టారు. ఈ లోపే ఆయన వెళ్లిపోయారు.