కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు… గడచిన కొద్ది రోజులుగా ఇదే అంశంపై ఆంధ్రాలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. మీడియాలో రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. టీడీపీకి కాంగ్రెస్ తో పొత్తు ఎలా అసాధ్యమో… ఎందుకు సాధ్యమో అనే లెక్కలు చాలామంది చెప్పేస్తున్నారు. నిజానికి… ఇదే అంశమై కాంగ్రెస్ పార్టీలోగానీ, టీడీపీలోగానీ అధికారికంగా చర్చ జరిగిన దాఖలాలు లేవు. అయితే, ప్రత్యేక హోదా విషయంలో ఎలాగూ భాజపా ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి… ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది కాంగ్రెస్సే కాబట్టి… రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చిట్ట చివరకు ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం సీఎం చంద్రబాబుకు అనివార్యం అవుతుందనేది కొందరి విశ్లేషణ! ఇదే విషయమై టీడీపీ నేతలు కూడా స్పందిచేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉండే అవకాశాలు అస్సలు ఉండవంటే ఉండవు అని చెప్తున్నారు.
వాస్తవం మాట్లాడుకుంటే… కాంగ్రెస్ తో పొత్తు విషయమై టీడీపీలో ఇంత చర్చ జరగాల్సిన అవసరం ఇప్పుడు అస్సలు లేదు! ఏపీ ప్రయోజనాల అంశమే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అజెండా అవుతుంది. అయితే, ఇది జాతీయ స్థాయి అంశం కాదు కదా! లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి దేశవ్యాప్తంగా వేరే చర్చ ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అనేది నిర్ణయించే అంశాలు వేరేగా ఉన్నాయి. వాటిలో ఏపీ నుంచి హోదా అనేది ఒక అంశం కావొచ్చు. అయితే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి ఏమాత్రం కనిపించడం లేదు. ఒకవేళ వస్తే… టీడీపీ లాంటి పార్టీలను లెక్కచేయాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంటుందని ఎవ్వరూ అనుకోరు! ఒకప్పుడు కమ్యూనిస్టులనే పక్కన పెట్టేసిన చరిత్ర ఉంది. సో.. టీడీపీ వారికి ప్రత్యేకం కానే కాదు. ఒకవేళ కాంగ్రెస్ కి బొటాబొటీ మేజారిటీ వస్తే… టీడీపీ మద్దతు కోసం అప్పుడు వారే వెంటపడతారు. ఆ సమయంలో, ప్రత్యేక హోదా కావొచ్చు, ఇతర హామీల అంశమే కావొచ్చు… వెంటనే నెరవేరిస్తేనే మద్దతు ఇస్తామని టీడీపీ అప్పుడు మెలిక పెట్టొచ్చు. అల్టిమేట్ గా, పార్టీలకు అతీతంగా కేంద్రం నుంచి టీడీపీ సాధించుకోవాలనుకుంటున్నది ఇదే కదా.
ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వొచ్చనే ఆప్షన్ టీడీపీ ముందుంది! అలాంటప్పుడు, ఎన్నికల ముందుగానే కాంగ్రెస్ కు చేరువౌతున్నట్టు సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం, స్పష్టం చేయాల్సిన అత్యవసరం టీడీపీకి ఏమాత్రమూ లేదు! ముందే స్పష్టత ఇస్తే… రాష్ట్రంలో తెలుగుదేశం నష్టపోతుందనేది చంద్రబాబు నాయుడుకి తెలియంది కాదు. ఇంకోటి.. లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే… అప్పుడు టీడీపీ పరిస్థితి ఏమౌతుంది..? ఈ విశ్లేషణ చంద్రబాబు చేసుకుంటారు కదా. కాబట్టి, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో పొత్తుపై మాట్లాడాల్సిన అవసరం ఏ కోశానా టీడీపీకి లేదు, ఒకవేళ మాట్లాడితే అది వారికే మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. హోదాకి అనుకూలంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు కాబట్టి… తదనుగుణంగా టీడీపీ స్పందించాల్సిన అవసరం కనిపించడం లేదు. అందుకేనేమో, ఈ అంశంపై రాజకీయంగా ఇంత చర్చ జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం స్పందించడం లేదు.