- టైటిలేమో… బి.గోపాల్ – బాలయ్య సినిమాలా ఊర ఫ్యాక్షన్ లా అనిపించింది.
- టీజర్ చూస్తే.. ముద్దుల గోల కనిపించింది
- పబ్లిసిటీ ఏమో.. ‘ఏం మాట్లాడుతున్నావ్ రా.. డాష్ డాష్’ అనిపించేలే చేసింది.
- బి గ్రేడ్ సినిమా టైపు ముద్ర పడి, ఎలాంటి అంచనాలూ లేకుండా మొదలై.. థియేటర్లో బొమ్మ పడేసరికి.. అదే సంచలనమైంది. కల్ట్ క్లాసిక్ అనిపించేలా చేసింది. నవతరం తెలుగు సినిమాని ఓ కుదుపు కుదిపేసింది.
అదే… అర్జున్ రెడ్డి!!
సినిమా అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే లెక్కలేం లేవు.. అని తెలిసినా – అదేదో రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు కలిపి ఉడికించాలన్నట్టు… అది కొంత.. ఇది కొంత అంటూ లెక్కలేసుకుని సినిమాని వండేస్తుంటాడు. అందులోనే ఆకాశంలో కూర్చోబెట్టేన్ని హిట్లొస్తుంటాయి, చాచి పెట్టి కొట్టేన్ని ఫ్లాపులు వస్తుంటాయి. ఎలాంటి కొలతలూ లేకుండా ఓ సినిమా తీయడం, అది భావి చిత్రాలకు ఓ పారా మీటర్‌గా నిలబడిపోవడం చాలా అరుదుగా జరిగే అద్భుతాలు. అందులో ‘అర్జున్ రెడ్డి’ ఒకటి.
ట్రైలర్లలో ముద్దులు, మందు బాటిళ్లు, బూతులు.. పబ్లిసిటీలో విజయ్ దేవరకొండ చేసిన ఎగస్ట్రాలు చూసి ‘ఇదేదో ఓవర్ యాక్షన్‌సినిమాలా ఉంది’ అనుకున్నారంతా. చీప్ పబ్లిసిటీ ట్రిక్స్ అని క్రిటిక్స్‌కూడా తేల్చేశారు. వాళ్లంతా ‘అర్జున్ రెడ్డి’ చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. షాట్ డివిజన్, మేకింగ్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అన్నింటికీ మించి డైరక్షన్ స్కిల్స్, వీటితో పాటు విజయ్ నటన… ఇవన్నీ కలసి ‘అర్జున్ రెడ్డి’ ని ఎక్కడో కూర్చోబెట్టేశాయి.
ఎవరీ సందీప్ రెడ్డి వంగా? అంటూ ఒక్కసారిగా పరిశ్రమ మెడలు నొప్పెట్టేంత వరకూ అటువైపు తిరిగి చూసింది. ఒకొక్కరూ నాలుగేసి కర్చీఫ్‌లు రెడీ చేసుకుని విసిరే కార్యక్రమం మొదలెట్టాయి. ఒక్క సినిమాతో… విజయ్ దేవరకొండ స్టారైపోయాడు. ఊపిరి తీసుకోలేనంతగా బిజీ అయిపోయాడు. ‘తీస్తే అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీయాలి’ అని దర్శకులు, నటిస్తే అలాంటి సినిమాలో నటించాలని హీరోలు ఫిక్సయిపోయారు. అదిగో… ఆ ప్రభావం, ఇప్పటికీ కనిపిస్తోంది. ‘అర్ఝున్ రెడ్డి’ సినిమా కేవలం ముద్దుల వల్లో, పబ్లిసిటీ ట్రిక్కుల వల్లో ఆడలేదు. అందులోని ఎమోషన్స్ బలంగా పట్టేశాయి. విజయ్ నట విశ్వరూపం విస్మయపరిచింది. కొన్ని సాహసోపేతమైన షాట్లు… ఈ సినిమా గురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకునేలా చేశాయి. ‘అర్జున్ రెడ్డి’ కథ అటు తమిళంలోనూ, ఇటు హిందీలోనూ రీమేక్ అవుతోంది.
ఇక్కడిలా అక్కడ కూడా సంచలనాలు సృష్టిస్తుందో లేదో, తెలీదు గానీ…. తెలుగులో ఓ కల్ట్ క్లాసిక్ వచ్చిందన్న కబురు.. దేశమంతా పాకేలా చేసింది. తప్పదు.. అర్జున్ రెడ్డి ఫీవర్ ఇంకా కొన్నేళ్లు ఇలాగే సాగుతుంది. ఆ ప్రభావం నుంచి బయట పడడం కష్టం. ఈ ఫీవర్ మంచి చేసిందా, చెడు చేయబోతోందా? అనేది పక్కన పెడితే… కొత్త ఆలోచనలకు బీజం వేసింది అర్జున్ రెడ్డి. చిన్న సినిమాలు మరిన్ని పట్టాలెక్కడానికి ఊతం ఇచ్చింది. మొద్దు బారిపోయిన మెదళ్లలో కదలిక తీసుకొచ్చింది. అంతకంటే ఇంకేం కావాలి. మరికొన్నాళ్లు అర్జున్ రెడ్డి గురించి మాట్లాడుకుంటూనే ఉందాం..ఆ వేడి వేడి ఊసుల్లో మనల్ని మనం రీఛార్జ్ చేసుకుందాం…!
( ‘అర్జున్ రెడ్డి’ విడుదలై యేడాది పూర్తయిన సందర్భంగా)