జి.హెచ్.ఎం.సి. ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు చాలా ఉదృతంగా ప్రచారం చేస్తున్నా ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రుల కొడుకులు నారా లోకేష్, కె.టి.ఆర్. ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇరువురు కూడా నేరుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొనప్పటికీ ఒకరి ప్రభుత్వాలపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. వారి ప్రచారంలో వారి బలాలు, బలహీనతలు స్పష్టంగా కనబడుతున్నాయి.
కె.టి.ఆర్. మంచి వాగ్ధాటి ప్రదర్శిస్తూ ప్రజలను ఆకట్టుకొంటుంటే, లోకేష్ తెరాస ప్రభుత్వంపై సునిశితంగా చేస్తున్న విమర్శలు ప్రజలను చాలా ఆకట్టుకొంటున్నాయి. గత 19నెలల కాలంలో తమ ప్రభుత్వం ఏమేమి సాధించిందో, రానున్న కాలంలో తమ ప్రభుత్వం హైదరాబాద్ ని ఏవిధంగా అభివృద్ధి చేయబోతోందో కె.టి.ఆర్. ప్రజలను ఆకట్టుకొనే విధంగా వివరిస్తున్నారు. అదే సమయంలో జంటనగరాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజలలో తెరాస పట్ల నెలకొన్న అపోహలని, అనుమానాలను, అభాద్రతాభావాన్ని తొలగించి వారిని తెరాసకి ఓటు వేసేలాగ బాగానే ప్రోత్సహిస్తున్నారని చెప్పవచ్చును. ఆంద్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా స్థిరపడి ఉన్న ప్రాంతాలలో ఆయన నిర్వహిస్తున్న రోడ్ షోలకి వారి నుండి మంచి స్పందన కనిపించడం తెరాసకు చాలా సానుకూలమయిన పరిణామంగా చెప్పవచ్చును. ఒకవేళ ఆంద్ర ప్రజలు తెరాసకు ఓటేసి గెలిపిస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా కె.టి.ఆర్.దే అవుతుంది.
ఇక నారా లోకేష్ తన ప్రచారంలో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే అస్త్రాలు సందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాలలో చాలా ఆర్భాటంగా చేసిన ప్రకటనలను, ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ వాటిలో ఏ ఒక్కటీ ఆయన ఇంతవరకు కూడా అమలుచేయలేక పోయారని చెపుతూ, కేసీఆర్ ప్రజలను ఏవిధంగా మభ్యపెడుతున్నారో చక్కగా వివరిస్తున్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, స్కై వేలు, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం, సైన్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి హామీలను ప్రజలకు గుర్తు చేసి, వాటిలో ఏ ఒక్కటీ కూడా ఇంతవరకు ఎందుకు అమలుచేయలేకపోయారు..కనీసం ఆ పనులు ఎందుకు మొదలుపెట్టలేదు? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో తన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి ఏవిధంగా కృషి చేసారో, గ్రేటర్ ఎన్నికలలో తెదేపా, బీజేపీ కూటమికి ఓట్లేసి గెలిపిస్తే తాము కేంద్రప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ ని ఏవిధంగా అభివృద్ధి చేసి చూపిస్తామో చాలా చక్కగా వివరిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు.
కానీ ఇరువురికీ కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. కె.టి.ఆర్. మంచి వాగ్ధాటి ఉంది కానీ నారా లోకేష్ కి లేదు. వివిధ హామీలు, అంశాలపై నారా లోకేష్ చాలా సునిశితంగా విమర్శలు చేయగలుగుతున్నారు కానీ వాటికి కె.టి.ఆర్. వద్ద జవాబులు లేవు. ఆంద్ర ప్రాంత ప్రజలను కె.టి.ఆర్. బాగానే ఆకట్టుకొంటున్నట్లు కనిపిస్తోంది. కానీ వారిని ఇంతకాలం అకారణంగా ద్వేషించినందుకు ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకోవలసి రావడం కె.టి.ఆర్.కి చాలా ఇబ్బందికరమే. కానీ లోకేష్ అదే ప్లస్ పాయింట్ అవుతుంది. ఆయన వారితో సులభంగా కలిసిపోగలుగుతున్నారు.
ఇరువురు ముఖ్యమంత్రులు, వారి కొడుకులు ఒకరినొకరు నేరుగా పరస్పరం విమర్శించుకోకపోయినా, వారి యుద్ధం చేస్తున్నది మాత్రం ఆ ఎదుటవారితోనే. ఈ యుద్దంలో తెరాస, తెదేపాలకి కె.టి.ఆర్., లోకేష్ సైన్యాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు కనుక, ఆ పార్టీలలో ఏది గెలిస్తే ఆ సైన్యాధ్యక్షుడికి రాజకీయంగా మరింత పట్టు, పలుకుబడి పెరిగే అవకాశం ఉంటుంది.