కథానాయకులు కుమార్తెలు, కథానాయికల కుమార్తెలు, దర్శకుల కుమార్తెలు, నటీనటుల కుమార్తెలు… వాళ్లూ వీళ్లూ అని తేడా లేదు. అందరూ సినిమాల్లోకి వస్తున్న రోజులివి! కథానాయికలుగా తమ ప్రతిభ చూపించాలని ఆశ పడుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నాయికగా సినిమాలు చేస్తున్నారు. ఒకప్పటి మలయాళ కథానాయికలు మేనక, లిజి కుమార్తెలు కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. అయితే… బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన దర్శకుడు పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర మాత్రం నటించడం ఇష్టం లేదంటోంది. ఆమెకు నిర్మాణం అంటే ఇష్టమట! ప్రస్తుతం పవిత్ర చదువుకుంటోంది. చదువు పూర్తయిన తరవాత ప్రొడక్షన్ లోకి వస్తానని తెలిపింది. ప్రొడక్షన్ లో సక్సెస్ అయ్యాక… మంచి అవకాశం వస్తే నటన గురించి ఆలోచిస్తానని చెబుతోంది. అన్నయ్య ఆకాశ్ పూరితో కలిసి చిన్నప్పుడు పవిత్ర ‘బుజ్జిగాడు’లో నటించింది. ‘మెహబూబా’తో ఆకాశ్ పూర్తిగా సినిమాల్లోకి వచ్చాడు. ఆ సినిమా తరవాత పవిత్రకు రెండు అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట! “అమ్మను వాళ్లు (రెండు సినిమాల యూనిట్ సభ్యులు) బాగా బతిమాలారు” అని పవిత్ర తెలిపింది. ప్రస్తుతం పూరి ఇంట్లో ఓ హీరో వున్నారు. త్వరలో నిర్మాత కూడా వస్తున్నారన్న మాట! పూరి సొంత నిర్మాణ సంస్థ బాధ్యతలను కుమార్తె చేపట్టే అవకాశాలు వున్నాయని అర్థం అవుతోంది కదూ!!