ఈమధ్య చేస్తున్న సినిమాల కంటే.. పుకార్లతో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు రానా. చాలా కాలం తరవాత మీడియా ముందుకు వచ్చే అవకాశం వచ్చింది. అదీ.. ‘కేరాఫ్ కంచర్ల పాలెం’ సినిమా ప్రమోషన్ల కోసం. ఈ చిత్రానికి రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రమోషన్ల బాధ్యత అంతా తానే చూసుకుంటున్నాడు. అందుకోసమని… శనివారం కొన్ని ప్రధాన పత్రికలకు పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే.. ఇంటర్వ్యూ మొదలవ్వముందే కొన్ని కండీషన్లు పెట్టాడు రానా. `ఓన్లీ సినిమాకి సంబంధించిన ప్రశ్నలే అడగండి.. పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్దు` అని గట్టిగా చెప్పాడట. ఆరోగ్యం గురించి వచ్చిన రూమర్లకు అస్సలు స్పందించలేదని తెలుస్తోంది. ‘ఇప్పుడు బాగానే ఉన్నా కదా, దాని గురించి ఎందుకు?’ అంటూ సమాధానం దాటేశాడట. ఈమధ్య రానా మరీ పీలగా మారిపోయాడు. దాని సంగతి అడిగితే… ‘ఇదంతా ఎన్టీఆర్ బయోపిక్ కోసమే.. చంద్రబాబు నాయుడు అప్పట్లో చాలా సన్నగా ఉండేవారు కదా? అందుకే తగ్గాను’ అంటున్నాడు. నిజానికి అంతకు ముందే.. రానా బాగా సన్నబడ్డాడు. ఎన్టీఆర్ ఆఫర్ వచ్చాక మరింత పీలగా మారిపోయాడు. రానాపై వచ్చిన గాసిప్పులకు రానానే సమాధానం ఇవ్వగలడు.ఆ అవకాశం వచ్చినా.. రానా ఉపయోగించుకోలేదు. అసలు వాటిపై మాట్లాడడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. అంటే ఆ గాసిప్పుల్లో నిజాలు ఉన్నాయనే కదా అర్థం..?!