అల్లరి నరేష్, సునీల్.. ఇద్దరూ కామెడీ కింగులే. కథ సెట్టవ్వాలే గానీ, సోలోగా రెచ్చిపోతారు. మరి ఇద్దరూ కలసి అల్లరి చేస్తే ఎలా ఉంటుంది? ఆ తొట్టిగ్యాంగ్కి భీమనేని శ్రీనివాసరావు లాంటి కామెడీ పల్స్ తెలిసిన దర్శకుడు జత కలిస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ‘సిల్లీ ఫెలోస్’లా ఉంటుంది. భీమనేని దర్శకత్వం వహించిన సినిమా ఇది. నరేష్, సునీల్ కథానాయకులుగా నటించారు. అటు నరేష్‌కీ, ఇటు సునీల్‌కీ విజయాలు లేవు. దానికి తోడు ‘సుడిగాడు’ తరవాత భీమనేని కూడా తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ ముగ్గురికీ ఈ సినిమా విజయం అత్యవసరం. ఇప్పుడు ‘సిల్లీ ఫెలోస్’ ట్రైలర్ విడుదలైంది. వీళ్ల కాంబోకి తగ్గట్టుగానే పంచ్ లు, సెటైర్లు, పేరడీలతో.. ట్రైలర్ సిల్లీగా సాగిపోయింది. సినిమాలో బోల్డంత ఫన్ ఉండబోతోందన్న సంగతి ట్రైలర్‌తో అర్థమైంది. ఫన్‌తో పాటు రూ.5 కోట్లకు సంబంధించిన ఓ ఇంట్రస్ట్రింగ్ ఎలిమెంట్ కూడా మిక్స్ చేశారు. అదేంటన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. నరేష్‌లో ఎలాంటి మార్పులేదు. సునీల్ మాత్రం మరీ లావుగా కనిపిస్తున్నాడు. ఇది వరకు చూసిన `బంతి`ని గుర్తు చేసేలా. క్వాలిటీ పరంగా చూస్తే.. కాస్త చుట్టేసిన ఫీలింగ్కలుగుతుంది. భీమనేని బలం కామెడీ. దాన్ని నరేష్, సునీల్ అద్భుతంగా పండించగలరు కూడా. సిల్లీ ఫెలోస్ పేరుకు తగ్గట్టు థియేటర్లో వీరిద్దరూ అల్లరి చేస్తే.. అటు నరేష్‌కీ ఇటు సునీల్‌కీ ఓ విజయం దక్కుతుంది.