వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో అంతా సవ్యంగానే ఉందా..?. ఈ రోజు సాక్షి పేపర్ చూసిన వారికి.. ఈ విషయంలో అనుమానం రావడం సహజమే. ఎందుకంటే.. ఈ రోజు రాఖీ పౌర్ణమి. మామూలుగా అయితేనే జగన్, షర్మిల అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి కథలుకథలుగా… సాక్షి ఫ్యామిలీ పేజీలోనే కాదు.. మొదటి పేజీలోనూ ప్రచురించేవాళ్లు. కానీ ఈ సారి… అదీ ఎన్నికల ఏడాది.. “అన్నాచెల్లెళ్ల అనుబంధం”పై సాక్షిలో ఒక్క కథనం లేదు…అసలు పట్టించుకోలేదు. చివరికి తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆమె సోదరి ఎంపీ కవిత గురించి కూడా.. చాలా భావస్ఫోరకంగా కథనం రాశారు. కానీ జగన్ – షర్మిల అనుబంధనాన్ని మాత్రం పట్టించుకోలేదు.
అసలు లేకపోవడం అనే దాని కన్నా.. పూర్తిగా… షర్మిల అనే పేరు కానీ.. ఫోటో కానీ రావడం నిషేధించారనడం కరెక్ట్‌గా ఉంటుందని.. సాక్షిలో అంతర్గత వ్యవహారాలను దగ్గరగా చూస్తున్న వారు చెబుతున్నారు. సాక్షి పత్రికకు.. ప్రస్తుతం వైఎస్ జగన్ భార్య భారతి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె నుంచి షర్మిల గురించి ఎలాంటి కవరేజ్ ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట… షర్మిల పాదయాత్ర ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రత్యేక కథనాలు ప్రచురిద్దామని… ఫ్యామిలీ పేజీలోని పెద్దలు రెడీ అయ్యారు. అది తెలిసి.. భారతీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఇప్పుడు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారట. అప్పటి నుండి సాక్షి పత్రిక సిబ్బంది.. షర్మిలకు సంబంధించి ఎలాంటి.. వార్తలూ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సాధారణంగా.. షర్మిలకు సంబంధించిన వార్తలంటే.. ఫ్యామిలీ పేజీల్లో రాఖీ అనుబంధాలు, ఫాదర్స్ డే నాడు.. తండ్రితో అనుబంధాలు పంచుకోవడం లాంటివే ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాటి విషయంలో కూడా.. సాక్షిలో షర్మిలకు స్పేస్ దొరకడం లేదు.
కుటుంబంలో ఉన్న విబేధాల కారణంగానే భారతి అలాంటి ఆదేశాలు ఇచ్చారన్న ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. ఇది నిజమేనన్నట్లుగా.. షర్మిల కూడా.. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ వద్దకు వెళ్లి రాఖీ కట్టలేదు. గత ఏడాది షర్మిల రాఖీ కట్టిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన జగన్…” షర్మిపాపను మిస్సవుతున్నా ” అని పోస్టు పెట్టారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తూంటే.. జగన్ ఫ్యామిలీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న ప్రచారం ఊపందుకుంటోంది. కొద్ది రోజులుగా.. షర్మిలతో పాటు.. ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా….ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టిక్కెట్ల విషయంలోనే జగన్ ఫ్యామిలీలో చర్చలు విబేధాలకు దారి తీస్తున్నాయని వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది.