కమెడియన్‌గా ఉన్నప్పుడు ఉన్నది హీరోగా మారినప్పుడు లేనిది ఏమిటో సునీల్‌కి ఇప్పుడు తెలిసుంటుంది. అందుకే ప్రస్తుతం ఈ ‘సీజన్’ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కమెడియన్ గా ఉన్నప్పుడు చేతినిండా సినిమాలుండేవి. ఏ పెద్ద సినిమా చూసినా తనే. బాగా సంపాదించేవాడు. హీరోగా మారాక… సినిమాల్ని ఆచి తూచి ఎంచుకోవడం మొదలెట్టాడు. మొదట్లో బాగానే ఉన్నా, ఆ తరవాత ఫ్లాపులొచ్చాయి. ఆ ప్రభావం పారితోషికంపైనా పడింది. ఓ దశలో.. ‘పారితోషికం వద్దు… మంచి సినిమా చేయగలిగితే చాలు’ అనే స్థితికి వెళ్లాడు. ఇప్పుడు మళ్లీ ‘యూ టర్న్’ తీసుకుని కామెడీ పాత్రలు కోరుకుంటున్నాడు. ఇప్పుడు సునీల్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. అవన్నీ మంచి పారితోషికం అందిస్తున్నాయి. కమెడియన్‌గా ఉన్నప్పుడు రోజువారీ పారితోషికం తీసుకునేవాడు సునీల్. ఇప్పుడు మళ్లీ అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. ఒక్కో కాల్షీట్లూ రూ.3 లక్షలకుపైనేగా పలుకుతుందని టాక్. ఇప్పుడు స్టార్ కమెడియన్లకు సైతం రోజుకి రూ. 1.5 లక్షలు దాటడం లేదు. సునీల్ దానికి డబుల్ సంపాదిస్తున్నాడన్నమాట. అయితే ఈ వెలుగు కూడా ఎంత కాలమో చెప్పలేం. కమిడియన్‌గా చేస్తున్న సినిమాలు క్లిక్ అయి, అందులో సునీల్ పాత్రకు కూడా మంచి పేరొస్తే తప్ప.. సునీల్ కెరీర్ ఇదే రీతిన సాగదు.కాకపోతే ప్రస్తుతానికి మళ్లీ రెండు చేతులా సంపాదించుకోగలుగుతున్నాడు సునీల్. అంతకంటే కావల్సింది ఏముంది?