భారతీయ సినిమాలలో సాధారణంగానే కుటుంబ సంబంధాలకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక తెలుగులో అయితే కేవలం సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగానో, బ్రదర్ సెంటిమెంట్ ఆధారంగానో, మదర్ సెంటిమెంట్ ఆధారం గానో, ఇలా ఒక త్రెడ్ తీసుకుని పూర్తి కథని దాని చుట్టూ అల్లుకొని వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి హీరోకి తన సిస్టర్ తో ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని వచ్చి గొప్ప విజయాన్ని సాధించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇవాళ రక్షాబంధన్. ఒకసారి తెలుగు సినిమాలలో “హీరో సిస్టర్” అనే పాత్ర కి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ఎలా పరిణామం చెందిందో చూద్దాం.
సిస్టర్ సెంటిమెంట్ సినమాలు దాదాపు అందరూ చేశారు:
ఎన్టీఆర్ రక్తసంబంధం మొదలుకొని ఇటీవలి కాలం దాకా చాలా సినిమాలు అన్నాచెల్లెళ్ల అనుబంధం ప్రధాన ఇతివృత్తంగా తెలుగులో వచ్చాయి. ఎన్టీఆర్ తీసిన రక్తసంబంధం, చిట్టి చెల్లెలు లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అప్పట్లో. ఇక నాగేశ్వరరావు బంగారు గాజులు, కృష్ణంరాజు పల్నాటి పౌరుషం కూడా సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు వందవ సినిమా లంకేశ్వరుడు కూడా చిరంజీవి -రేవతి ల మధ్య అన్న చెల్లెళ్ళ సంబంధం ఆధారంగానే తీయబడింది. కానీ అది అప్పట్లో చాలా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. కానీ చిరంజీవి కెరీర్ బాగా కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన హిట్లర్ సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా సాగేదే. బాలకృష్ణ సినిమాలు ముద్దుల మామయ్య. యువరత్న రాణా లాంటివి ఇదే కథాంశంతో రూపొందాయి.
ఇక పవన్ కళ్యాణ్ తీసిన “అన్న”వరం సినిమా, చెల్లెలి కోసం తాపత్రయపడే అన్నయ్య పాత్ర గురించి అయితే, మహేష్ బాబు తీసిన అర్జున్ సినిమా అక్క జీవితాన్ని కాపాడడానికి తాపత్రయపడే తమ్ముడి పాత్ర గురించిన సినిమా. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా చెల్లెలి మరణం తర్వాత ఎందరో చెల్లెళ్లకు అన్నగా మారిన యువకుడి కథ. రక్త సంబంధం, హిట్లర్ లాంటి పెద్ద హీరోల సినిమాలే కాదు, చిన్న హీరోలు తీసిన పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు లాంటి సినిమాలు కూడా భారీ విజయాన్ని సాధించాయి. బిసి సెంటర్లలో కనకవర్షం కురిపించాయి. పుట్టింటికి రా చెల్లీ అనే సినిమా కి అయితే బి,సి సెంటర్లలో బుధవారం రోజు మార్నింగ్ షో కి కూడా జనాలు క్యూలో నిలబడి టికెట్స్ తీసుకోవడం కొంతమందికి ఇప్పటికీ గుర్తుండి ఉండవచ్చు.
“కన్నీటి కెరటాల” హీరో చెల్లెలి పాత్ర – 90 ల దాకా :
ఇలా ప్రతి హీరో కూడా ఏదో ఒక సమయంలో సిస్టర్ సెంటిమెంట్ అంశాన్ని స్పృశిస్తూ సినిమాలు తీసిన వాళ్లే. అయితే హీరో సిస్టర్ క్యారెక్టరైజేషన్ తెలుగు సినిమాల్లో పరిణామం చెందుతూ, రూపాంతరం చెందుతూ వచ్చింది. బేసిగ్గా మనది పురుషాధిక్య సమాజం కావడంతో, సినిమాల్లో కూడా హీరో పాత్ర ఎలివేట్ అవ్వడమే ప్రధాన ఇతివృత్తం కావడంతో, ప్రక్క పాత్రలు కష్టాలు పడటం, వాటిని హీరో తీర్చడం ఇదే తీరుఅన్ని సినిమాల్లోనూ. ఇదే ధోరణి హీరో చెల్లెలి పాత్ర చిత్రీకరణ లోనూ కొనసాగింది. పెళ్ళి కారణంగానో, మరో రకంగానో చెల్లెలి పాత్రకు కష్టాలు రావడం, ఆ కష్టాలను హీరో తీర్చడం అన్న అంశం చుట్టే దశాబ్దాలపాటు హీరో చెల్లెలి పాత్ర చిత్రీకరణ కొనసాగింది.
ఎన్టీఆర్ నాగేశ్వరరావుల కాలం నుంచి పవన్ కళ్యాణ్ అన్నవరం మహేష్ బాబు అర్జున్ ల వరకు ఇదే క్యారక్టరైజేషన్ కొనసాగింది. రివెంజ్, స్మగ్లింగ్ లాంటి హీరోయిక్ కథలు తెలుగు సినిమాల్ని డామినేట్ చేసిన 80,90 దశకాల్లో అయితే– హీరో చెల్లెలి పాత్ర ని దారుణంగా చంపేస్తే కానీ దర్శక రచయితలకి మనశ్శాంతి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఆ చావు కూడా మామూలుగా కాదు. ఒక్కోసారి అఘాయిత్యం చేసి చంపేవారు. లేదంటే, తను ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు ఆమె పొట్టలో క్యిబా క్యిబా తన్ని చంపే వారు. మన రచయితలు ఈ క్యారెక్టరైజేషన్ ని ఒక దశాబ్దం పైగా కొనసాగించారు. ఒక నటి ఉండేది వరలక్ష్మి అని చెల్లెలి పాత్రకి స్టాండర్డ్ గా. ఎన్ని సినిమాల్లో చచ్చిపోయేదో! ఒకానొక సమయంలో ఫస్ట్ ఫ్రేమ్ లో ఆ నటి కనిపించగానే, ఆ పాత్ర క్లైమాక్స్‌ని ఊహించగలిగే వాళ్ళు ప్రేక్షకులు. ఇది లేట్ 80స్, ఎర్లీ 90స్ లో కథా కమామీషు.
90 ల తర్వాత హీరో ఫ్రెండ్ గా మారిన హీరో చెల్లెలు :
తర్వాత్తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారాయి. ప్రేమికుడు సినిమాలో హీరో, హీరో వాళ్ళ నాన్న కలిసి మందు కొట్టి, ఫ్రెండ్స్ లా మాట్లాడుకునే సీన్ చూసాక మన రచయిత దర్శకుల్లో నెమ్మదిగా మిగతా కుటుంబ పాత్రలనీ ఫ్రెండ్స్ గా చేయడం మొదలైంది. తొలిప్రేమ లో హీరో చెల్లెలు పాత్ర జనాల్ని బాగా ఆకట్టుకుంది. హీరో తో బాగా అటాచ్మెంట్ ఉండి, ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేలా కరుణాకరన్ ఆ క్యారెక్టర్ ని తీర్చి దిద్దిన విధానం ఆ సినిమా సక్సెస్ కి బాగా దోహదపడింది. అయితే తొలిప్రేమ తర్వాత వచ్చిన సత్యం, వాసు తదితర సినిమాలన్నీ తొలిప్రేమ ట్రెండ్ ని కంటిన్యూ చేశాయి. ఈ ట్రెండే ఇప్పటికీ కొనసాగుతోంది
ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయిన కొన్ని సిస్టర్ పాత్రలు:
అయితే అప్పట్లో నే, మృగం అని జెడి చక్రవర్తి సినిమా వచ్చింది. సురేష్ వర్మ దర్శకుడు. అందులో- హీరో హీరోయినూ; హీరో చెల్లెలు-ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి పబ్ కి వెళ్ళే సీన్ ఉంటుంది. ఆ రకంగా సురేష్ వర్మ/జెడి ఒకడుగు అలా ముందుకి (?) వేశారు. అయితే ప్రేక్షకులు ఆ ముందడుగు ని జీర్ణించుకోలేకపోయారు. అలాగే చెన్నకేశవరెడ్డి సినిమా లో, హీరో చెల్లెలు పాత్రధారి అయిన దేవయాని, తన భర్తని నరికేసి, అన్నయ్య అయిన హీరోతో, “మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోయాడు” అని చెబుతూ సెంటిమెంట్ పండించడానికి చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
ఫైనల్ గా:
అయితే గత ఐదారేళ్లుగా థ్రిల్లర్లు, హారర్ సినిమాల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతూ ఉండడం వల్ల హీరో సిస్టర్ పాత్ర క్యారెక్టరైజేషన్ లో పెద్ద విప్లవాత్మక మార్పులు ఏమీ రాలేదు. 90వ దశకంలో ప్రతి సినిమాలోనూ చచ్చిపోయి, అన్యాయం అయిపోయే హీరో చెల్లెలి పాత్రని, కరుణాకరన్ లాంటి దర్శకులు తొలిప్రేమ లాంటి సినిమాలలో కొత్తగా చూపించిన తర్వాత, ఇప్పటికీ హీరో చెల్లెలి పాత్ర హీరోకి ఫ్రెండ్‌లా కొనసాగే విధంగానే తీర్చిదిద్దబడుతోంది
ఏదిఏమైనా రక్షాబంధన్ సందర్భంగా, ఇదీ తెలుగు సినిమా లో హీరో సిస్టర్ క్యారెక్టరైజేషన్ మీద అవలోకనం!
-జురాన్ (CriticZuran)