ఆచి తూచి సినిమాలు తీసే దర్శకుల్లో సంపత్‌నంది ఒకరు. హిట్టొచ్చినప్పుడే… నిదానంగా సినిమాలు తీస్తుంటారాయన. అలాంటిది ఫ్లాప్ వస్తే… ఇంకెంత జాగ్రత్త పడిపోతారు.?? ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గౌతమ్ నందా’ బాక్సాఫీసు దగ్గర నిరాశ పరిచింది. అన్నీ ఉన్నా – ఏదో వెలితి కనిపించిన సినిమా అది. అందుకే ప్రేక్షకులు ఆదరించలేదు. అయితే.. ఈసారి మళ్లీ అదే గోపీచంద్‌కి ఓ కథ చెప్పి ఒప్పించారు సంపత్. ఇప్పుడు ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. అక్టోబరులో సెట్స్‌పైకి వెళ్తుంది. సంపత్ నంది నిర్మాతగా తెరకెక్కించిన ‘పేపర్ బోయ్’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రొడక్షన్ లోనూ, ప్రచార కార్యక్రమాల్లోనూ బిజీగా ఉన్న సంపత్… గోపీచంద్ సినిమాపై దృష్టి పెట్టలేకపోయారు. `పేపర్ బోయ్` బయటకు వచ్చిన వెంటనే… మళ్లీ గోపీచంద్ సినిమాలో నిమగ్నమవుతార్ట. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణల ఎంపిక జరుగుతోందిప్పుడు. ఈ సినిమా పక్కా, మాస్ మసాలాతో సాగబోతోందని, అయితే ఓ కొత్త పాయింట్ ఈ కథలో కనిపించబోతోందని, ఆ పాయింట్ అందరినీ షాక్‌కి గురి చేస్తుందని సమాచారం. మరి ఈసారి గోపీచంద్ కోసం సంపత్ నంది ఎలాంటి కథ అల్లాడో చూడాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.