వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విద్యాధికుడు. ఎప్పుడూ టక్ చేసుకుని.. కార్పొరేట్ వ్యక్తిలా కనిపిస్తారు. కానీ ఆయన చేసే రాజకీయం చూస్తే.. రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి కన్నా… కింది స్థాయి పార్టీ నేతల్లో ఎక్కువ పట్టు సంపాదించిన తర్వాత… ఆయన వ్యవహారశైలి అనూహ్యంగా మారిపోయింది. చదువు సంధ్యలు లేని గల్లీ స్థాయి నేతలు ఎంత దారుణంగా ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడుకుంటారో.. వాటినే మీడియా ముందు.. తన వ్యాఖ్యలుగా చెప్పేస్తూ ఉంటారు. చాలా సార్లు అవి వివాదాస్పదమయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి లాంగ్వేజ్ మార్చుకోవాలని ఎవరో ఇచ్చిన సలహాను..మరో రకంగా అర్థం చేసుకుని ఇలా తనను తాను దిగజార్చుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నారేమోనని.. ఆయనకు పరిచయం ఉన్నవాళ్ల అనుమానం.
అయితే ఒక్క మాటలే అలా ఉన్నాయనుకుంటే.. పొరపాటు.. ఆయన ప్రవర్తన కూడా అందే అథమ స్థాయిలో ఉంటోంది. నిన్నటికి నిన్న… మాజీ డీజీపీ సాంబశిరావు జగన్‌ను కలిశారు. ఆయన ఎందుకు కలిశారో ఎవరికీ తెలియదు. కానీ సాంబశివరావు జగన్ క్యాంప్ వద్దకు వచ్చినప్పుడు .. ఆయన కోసం ఎదురు చూసి.. కారు డోర్ తీసి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి. వెళ్లేటప్పుడు.. తనే స్వయంగా కారు డోర్ తీసి .. సాంబశివరావు కారులోకి ఎక్కే వరకూ స్టిఫ్ గా నిలబడ్డారు. విజయసాయిరెడ్డి చూపించిన అతి వినయం చూసి.. సాంబశివరావే ఆశ్యర్యపోవాల్సి వచ్చింది. కానీ ఆ అతి వినయం వెనుక అసలు వ్యవహారం.. సాంబశిరావుకు తాను వెళ్లిపోయిన తర్వాతే తెలిసింది. సాంబశివరావు పార్టీలో చేరబోతున్నట్లు… విజయసాయి ప్రకటించేసుకున్నారు. దీంతో వెంటనే ఖండన ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా ఓ వ్యక్తి అనుమతి లేకుండా.. కేవలం జగన్‌ను కలిశారనే అడ్వాంటేజ్ తీసుకుని.. పార్టీలో చేరారని… చేరబోతున్నారని చెప్పుకోవడం.. ఏ నైతికత..?
ఇదే కాదు.. సోషల్ మీడియాలోనూ.. విజయసాయిరెడ్డిది ఇదే ధోరణి. ఎంపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి… చంద్రబాబుపై, లోకేష్‌పై అత్యంత అసభ్యకరమైన పోస్టులను స్వయంగా ట్వీట్ చేసి.. అదో రకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దానికి పదుల సంఖ్యలో మళ్లీ మీడియా సంస్థలకు హ్యాష్ ట్యాగ్ చేస్తూంటారు. సోషల్ మీడియాలో ఐడెంటిటీలు తెలియకుండా.. చిల్లర వేషాలు వేసే..సోషల్ మీడియా కార్యకర్తలు చేసే పోస్టులు అవి. వాటిని విజయసాయిరెడ్డి .. తన ఎంపీ అధికారిక.. వెరిఫైడ్ అకౌంట్లో … పోస్ట్ చేస్తున్నారు. దీన్ని చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్య పోతున్నారు. విజయసాయిరెడ్డి.. ఇంత దిగజారుడు.. రాజకీయం చేస్తున్నారేమిటా అని. .? ఆయనను తనను తాను ఊర మాస్ అనుకుంటున్నారనే సెటైర్లు కూడా పడుతున్నాయి. కానీ ఇలాంటి వ్యవహారాల వల్ల.. మాస్లో క్రేజ్ పెరుగుతుందో లేదో కానీ.. తటస్థ ఓటర్లలో మాత్రం కచ్చితంగా వ్యతిరేకత వచ్చి పడుతుంది. ఆ విషయాన్ని విజయసాయి అర్థం చేసుకోలేకపోతున్నారు.