కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా కథలు అల్లడంలో కోన వెంకట్ దిట్ట. ఢీ, రెఢీ, దూకుడు…. ఇలా చాలా మంచి హిట్లున్నాయి అతని ఖాతాలో. విలన్ని బకరా చేసి హీరో ఆడుకునే కాన్సెప్టులకు తనే ఆధ్యుడు. ఇప్పుడు ఆ కాలం చెల్లిపోయింది. ట్రెండ్ మారింది. కోన కూడా మారాల్సివచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ‘నేను… ఆ పాత కమర్షియల్ సినిమాలే తీస్తా.. జాగ్రత్త’ అని హెచ్చరిస్తున్నాడు. ఈమధ్య కోన `నీవెవరో` అనే సినిమా తీశాడు. దానికి రచన అందించడమే కాకుండా, నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించాడు. ఈసినిమాకి సరైన స్పందన రాలేదు. ‘జాబు సంతృప్తి వచ్చింది.. జేబు సంతృప్తి ఇంకా రాలేదు’ అని కోననే స్వయంగా చెబుతున్నాడు కూడా. ఈ సినిమా చాలా కష్టపడి చేశామని, కోట్లు ఖర్చు పెట్టి తీశామని, పది రూపాయల పెన్నుతో దాన్ని జడ్జ్ చేయొద్దని.. విమర్శకులపై రెండు మూడు బాణాలు విసిరాడు. ఇది ఆక్రోశం కాదని, ఆవేదనని.. చెప్పుకొచ్చాడు కోన. `ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే తీస్తావా` అని అడిగినందుకే `గీతాంజలి`తో రూటు మార్చారని, `నీవెవరో` లాంటి మంచి కథల్ని, కొత్త కాన్సెప్టుల్నీ ఆదరించకపోతే… మళ్లీ ఆ పాత కమర్షియల్ సినిమాలే తీస్తానని ఓ హెచ్చరికలాంటిది జారీ చేశాడు. సినిమా తీసేది చూసేవాళ్ల గురించే గానీ, తీసేవాళ్ల కోసం కాదని… పరోక్షంగా విమర్శకుల్ని ఎత్తుకున్నాడు. ఇలా అన్నానని మళ్లీ హెడ్డింగులు పెట్టి న్యూస్లు సృష్టించొద్దని.. సుతిమెత్తగానే చురకలు వేశాడు. మొత్తానికి ‘నీవెవరో’ రిజల్ట్పై, దాని పై వచ్చిన రివ్యూలపై కోన సంతృప్తిగా లేడన్నది మాత్రం అర్థమైంది.