భారతీయ జనతా పార్టీలోకి కొంతమందిని కండువా కప్పి, ఆహ్వానించే ఓ కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో అవినీతి రహితమైన పాలన కోసం ఆకాంక్షిస్తున్నవారంతా భాజపాలో చేరుతున్నారన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారు కేవలం కండువాలు కప్పుకుంటే సరిపోదనీ… రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. విభజిత రాష్ట్రమైన ఆంధ్రా కోసం ఎన్డీయే ప్రభుత్వం ‘చాలా’ చేసిందని మరోసారి చెప్పారు!
ఆంధ్రాలో ప్రజలు మార్పు కావాలని ఆకాంక్షిస్తున్నారని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఒక దృఢమైన పాలన, సుస్థిరపాలనను ప్రజలు కోరుకుంటున్న మాట వాస్తవం అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బేరీజు వేసుకుని చూస్తే… ఆ సామర్థ్యం భాజపాకి మాత్రమే ఉంటుందని అర్థమౌతుందన్నారు! విభజన తరువాత రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంది తామేననీ, కానీ అభివృద్ధికి అడ్డుపడుతున్నామంటూ తమపై దుష్ప్రచారం తీవ్రంగా జరుగుతోందన్నారు. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, చేసిన మేలును ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు పురందేశ్వరి!
ఏపీ ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ భాజపా నేతలకు అర్థం కావడం లేదేమో..! అర్థమైనా సరే… కావాలనే వాటిని పక్కన పడేసే ప్రయత్నం చేస్తున్నారేమో..! పురందేశ్వరి మాటలు అచ్చం అలానే ఉన్నాయి. ఆంధ్రాలో సుస్థిర పాలన, దృఢమైన పాలన గురించి చర్చ లేనే లేదు! ఆ సమస్య తమిళనాడులో ఉంది. ఆంధ్రాలో రాజకీయ అనిశ్చితి ఎక్కడుంది..? విభజన తరువాత ఆంధ్రాకి కేంద్రం చెయ్యాల్సిన న్యాయం చెయ్యలేదు… కేంద్రంలో అధికార పార్టీగా భాజపా ఆ విషయంలో విఫలమైంది… ఇదే ఏపీలో ప్రస్తుత చర్చనీయాంశం!
పురందేశ్వరి చెప్పిన మాటల్లో ఓ నిజం ఏంటంటే… ఆంధ్రులు పాలనలో మార్పు కోరుకుంటున్నారన్నది! అయితే, ఆ మార్పు కేంద్రంలో రావాలని కోరుకుంటున్నారు. ఆంధ్రాని అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు ఇప్పటికిప్పుడు భాజపాలో వచ్చినా… హ్యాపీగా ఆదరిస్తారు. అది భాజపాలో కనిపించడం లేదు కాబట్టే… మార్పు కోరుకుంటున్నది! రాష్ట్రస్థాయిలో.. పాలన మార్పు అనేది చర్చ కానే కాదు. పరిస్థితుల్లో మార్పు మాత్రమే ఆంధ్రులు కోరుకుంటున్నది. ఈ పాయింట్ వదిలేసి… ఆంధ్రాలోకి భాజపా అధికారంలోకి వచ్చేయ్యాలన్నట్టుగా కేడర్ ని ఎంకరేజ్ చేస్తున్నారు పురందేశ్వరి! కేంద్రంలో ప్రస్తుతం అధికారంలోనేగా ఉన్నారు కదా… ఆ మార్పేదో ఇప్పుడే చేసి చూపించొచ్చు కదా.