తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ భయపడుతోందన్న కేటీఆర్ విమర్శను రేవంత్ తిప్పి కొట్టారు. 133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాదాపు 50 యేళ్లుపాటు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉందనీ, తమకు ఎన్నికలు కొత్తకాదని రేవంత్ అన్నారు. ఎన్నికలంటే తమకు భయమని కేటీఆర్ అనుకోవడం అవగాహనా రాహిత్యమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయమై ఎన్నడూ ప్రధానిని కలవని కేటీఆర్, కేసీఆర్ లు… ఈ మధ్య ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారన్నారు..? సరైన సమయంలో ఎన్నికలు జరిగితే తెలంగాణలో తెరాస అడ్రస్ గల్లంతు అవుతుందనీ, ఆ విషయం వారు చేయించుకున్న 14 సర్వేల ద్వారా తెలియడం వల్లనే తండ్రీ కొడుకులు భయపడుతున్నారన్నారు.
25 లక్షల ప్రజలు, 2.5 లక్షల వాహనాలు, ప్రగతి నివేదిన సభ నిర్వహణకు అయ్యే రూ. 500 కోట్లు, ఒక్కో ఎమ్మెల్యేకీ సభ ఖర్చుల కోసం బాక్సుల్లో పెట్టిచ్చిన రూ. 1 కోటి… వీటి గురించి ప్రజలకు వివరణ ఇవ్వాలని కేటీఆర్ ని డిమాండ్ చేశారు. ఈ సభకు ప్రగతి నివేదన సభ అని కాకుండా.. కేసీఆర్ ఆవేదన సభగా పేరు పెట్టుకోవాలని రేవంత్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రిని చెద్దామని కేసీఆర్ కోరిక అన్నారు. గాడిదకు కళ్లెం కట్టినంత మాత్రాన అది గుర్రం కాదనీ, కేటీఆర్ సమర్థత ఎంతో తండ్రిగా ఆయనకి బాగా తెలుసన్నారు. మొదట వాటర్ గ్రిడ్ అన్నారనీ, సరిగ్గా చేయడం లేదని పీకేశారన్నారని చెప్పారు! తరువాత పంచాయతీరాజ్ లో ఉన్నారనీ, అక్కడా సరిగా చేయడం లేదని పీకేశారన్నారు. అసమర్థుడు అని ముద్ర వేసి శాఖలు మార్చింది మీరేననీ, అలాంటి కేటీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అవుతారని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ కి ఓ సవాల్ కూడా చేశారు! ఇద్దరం సిరిసిల్ల నియోజక వర్గంలో చెరోపక్క నుంచి యాత్ర చేద్దామనీ, ప్రజలు ఎవరి పక్షాన నిలబడతారో, ఎవరితో వస్తారో అనేది తేలిపోతుంది కేటీఆర్ అంటూ సవాల్ చేశారు. ‘వన్ సీ ఆర్ టు టెన్ సీఆర్ కేటీఆర్, హన్రెడ్ సీఆర్ టు ఆపైన కేసీఆర్ అని ప్రజలు అనుకుంటున్నారు’ అన్నారు రేవంత్. లంచాలకు సంబంధించి ఇది ఫిక్స్ అనీ, ప్రగతి భవన్ ను పైరవీ భవన్ అని తెలంగాణలో కోడై కూస్తోందన్నారు. తన ఆరోపణలకు వెంటనే కౌంటర్ ఇచ్చేసి, చర్చను పక్కన తోవ పట్టించడం కాకుండా… సభ నిర్వహణకు సంబంధించి తాను చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్నారు. ఐదేళ్లు పాలించమని అధికారం వచ్చిన ప్రజలకు ఏం సమాధానం చెప్తారో ముందుగా స్పష్టం చేయాలన్నారు.
మంత్రి కేటీఆర్ పై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్! ప్రగతి నివేదన సభపై కూడా విమర్శలు చేశారు. మరి, ఈ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. అన్నిటికీ మించి… కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించడం కూడా తీవ్రమైన వ్యాఖ్యే. ఎందుకంటే, ఇప్పుడు కేసీఆర్ వ్యూహంతా ఆ దిశగానే కనిపిస్తోంది కదా.