‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు..?’
– అన్నట్టుంది శ్రీనువైట్ల పరిస్థితి. ఈసారి హిట్టు కొట్టకపోతే.. ఇంకోసారి ‘హిట్టుకొట్టేందుకు ఓ సినిమా కూడా రాకపోయే’ ప్రమాదం ఉన్న దర్శకుడు ఆయన. ఆయన చేతిలో ఉన్న ఆఖరి అవకాశం `అమర్ అక్బర్ ఆంటోనీ`. అటు రవితేజకు, ఇటు శ్రీనువైట్లకూ ఈ సినిమా చాలా చాలా కీలకం. శ్రీనువైట్ల మారకపోతే – తన పంథా వీడి రాకపోతే.. ఈ సినిమాని గట్టెక్కించడం చాలా కష్టం. అయితే.. ఆ మార్పు ‘;అమర్ అక్బర్ ఆంటోనీ`లో కనిపిస్తోంది. ఇప్పటి వరకూ కేవలం కామెడీని, కొన్ని సన్నివేశాల్ని, క్యారెక్టరైజేషన్లను నమ్ముకున్న శ్రీనువైట్ల తొలిసారి ఓ బలమైన కథతో వస్తున్నాడట. కథలో ట్విస్టులు, టర్న్‌లు… ఆసక్తి గొలిపేలా ఉంటాయట. ఇప్పటి వరకూ శ్రీనువైట్ల రాసుకున్న కథల్లో `అమర్ అక్బర్ ఆంటోనీ` ప్రత్యేకంగా నిలవబోతోందని టాలీవుడ్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఎంచుకునే కథల్లో ఏదో ఓ వైవిధ్యం తప్పకుండా కనిపిస్తుంది. ఇన్ని వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆ సంస్థ.. శ్రీనువైట్ల లాంటి ఫ్లాప్ డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చిందంటే… కచ్చితంగా కథలో వైవిధ్యం ఉందనే అర్థం. శ్రీనువైట్ల కూడా… తనని తాను మార్చుకుని, తన పంథాలోంచి బయటకు వచ్చి ఈ కథ రాసుకున్నాడట. డైలాగుల కోసం కూడా ఓ కొత్త టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. `ఢీ`, `రెడీ`, `దూకుడు`లో శ్రీను డైలాగులన్నీ ఓ ఫార్మెట్లో సాగుతాయి. ఇప్పుడు ఆ విషయంలోనూ ఛేంజ్ చూపించబోతున్నాడట. మేకింగ్‌లో శ్రీను కాస్త ఉదాసీనంగా ఉంటుంటాడు. `ఈ సీనుకి ఇంత చాల్లే` అని త్వరగా ముగించాలని తాపత్రయపడుతుంటాడు. కానీ ఈసారి మాత్రం మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి శ్రీనువైట్లలో పరాజయ భయం పట్టుకుంది. దాన్నుంచి బయటకు రావాలంటే మంచి సినిమా తీయడమే మార్గం అనుకుంటున్నాడు. సెట్లో ఉన్నవాళ్లకీ, ఈ కథ తెలిసినవాళ్లకీ, చిత్రబృందానికీ కనిపించిన ఆ మార్పు.. రేపు ప్రేక్షకులకీ కనిపిస్తే.. `అమర్ అక్బర్ ఆంటోనీ` సూపర్ హిట్ కావడం ఖాయం.