మాజీ డీజీపీ సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. నాలుగు రోజుల కిందట.. ఆయన పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడంతో.. ఆయన వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. పోలీస్ బాస్‌గా ఉన్నప్పుడు.. సాంబశిరావుపై వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. టీడీపీ తొత్తు అని మండిపడ్డారు. అలాంటి వైఖరి ఉన్న పార్టీ అధినేతను సడన్‌గా సాంబశివరావును కలవడంతో అనేక ఊహాగానాలు వచ్చాయి. ఎంపీ విజయసాయిరెడ్డి.. మరింత అడ్వాంటేజ్ తీసుకుని… ఆయన త్వరలో వైసీపీలో చేరబోతున్నారని ప్రకటించారు. తర్వాత సాంబశివరావు తన ఖండన ప్రకటన చేసినప్పటికీ… అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.
ఇప్పుడు హఠాత్తుగా… ఉండవల్లికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాంబశివరావు సమావేశమయ్యారు. ఏ అంశాలపై చర్చించారన్నదానిపై క్లారిటీ లేదు కానీ.. రాజకీయాలపై మాత్రం కాదని.. మాజీ డీజీపీ మీడియాకు స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం గంగవరం పోర్టు సీఈవోగా ఉన్న సాంబశివరావు.. ఆ హోదానే జగన్ ను కలిశానని.., ఇప్పుడు.. చంద్రబాబును కలిశానని చెప్పుకొస్తున్నారు. గంగవరం పోర్టు, విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధిపై సలహాలు ఇచ్చానని చెబుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు.., నాకంత శక్తి కూడా లేదని మీడియా ముందు వ్యాఖ్యానించారు. వైసీపీలో చేరబోతున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై… సాంబశివరావు ఏమంత ఘాటుగా రిప్లై ఇవ్వలేదు. సమాచారలోపం కారణంగానే అలా జరిగి ఉండవచ్చన్నట్లుగా సమర్థింపుగా మాట్లాడారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ..పరోక్ష ప్రజాసేవకు తనకు ఆసక్తి ఉందన్న విషయాన్ని మాత్రం పరోక్షంగా… సాంబశిరావు వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయడమే కాదు.. నామినేటెడ్ పదవిపై విషయంపైనా తన అభిప్రాయాన్ని చెప్పారు. మొత్తానికి సాంబశివరావు.. వారం తేడాలో అటు ప్రతిపక్ష నేత జగన్ ను.. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఏవో రాజకీయ ఆలోచనలు లేకపోతే.. ఇంత చురుగ్గా.. సమావేశాలు జరపాల్సిన అవసరం ఏముందనేది.. రెండు రాజకీయ పార్టీల్లోనూ.. ముఖ్య నేతల అనుమానం. రాజకీయాలపై మాజీ డీజీపీ ఏమనుకుంటున్నారో.. ఆయనకు అవకాశాలిచ్చే విషయంలో రెండు పార్టీలు ఎలాంటి ఆలోచనలతో ఉన్నాయో.. క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.