రాష్ట్రంలోని ఒక్క ముస్లిం ఓటు కూడా వేరే పార్టీకి పడే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ… ముస్లింలపై వరాల జల్లులు కురిపించారు. రాజధాని అమరావతిలో భారీ మసీదు, ఇస్లామిక్ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామన్నారు. రాయలసీమలో కొన్ని జిల్లాలు తరహాలోనే ఇక్కడ కూడా ఉర్దూని రెండో భాష చేస్తామన్నారు. వీటితోపాటు యువత ఉపాధికి, ఉద్యోగావకాశాలకు సంబంధించిన డిమాండ్లను కూడా పరిష్కరిస్తామన్నారు. వివిధ కార్యక్రమాలకు నిధులనూ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రతిపక్ష పార్టీతోపాటు భాజపాను, పవన్ కూడా ఒకేగాటన కట్టి చంద్రబాబు విమర్శించారు. వైకాపా ముస్లింలను మోసం చేసిందన్నారు. అందరి ఓట్లూ వేయించుకున్న జగన్, ఇప్పుడు కేసుల నుంచి బయటపడటం కోసం భాజపాతో లాలూచీ పడుతున్నారని ఆరోపించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ మాట్లాడిన పవన్ కల్యాణ్ కూడా ఆ తరువాత కనిపించే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. ఎన్డీయే ఓడిపోవాలంటే పవన్, జగన్ లను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. మైనారిటీల సంక్షేమం మొదలుకొని ప్రత్యేక హోదా వరకూ తాము నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. కానీ, వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి, ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.
మత సామరస్యాన్ని మొదట్నుంచీ కాపాడిన పార్టీ టీడీపీ అంటూ దివంగత లాల్ జానా బాషాను గుర్తుచేశారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సీఎం వివరించారు. కాశ్మీరులో ఆశిఫా ఉదంతానికి కారణం ఎన్డీయే ప్రభుత్వమన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లులో అరెస్టు చేసే నిబంధనను తాము వ్యతిరేకించామన్నారు. అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ… కలామ్ రాసిన పుస్తకంలో… ‘చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేశారనీ, ప్రధాని వాజ్ పేయి ఫోన్ చేస్తారని చెప్పార’నే వాక్యాలను చదవి వినిపించారు. ముస్లింలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం తప్ప మరొకటి కాదని సీఎం అన్నారు.
వైకాపా, జనసేన, భాజపా… ఈ మూడింటినీ ఒకేగాటన కట్టి చంద్రబాబు విమర్శలు చేయడం గమనార్హం. వీటిలో ఏ పార్టీకి ఓటేసినా అది భాజపాకే వెళ్తుందన్న అభిప్రాయాన్ని వినిపించే ప్రయత్నమూ బలంగానే చేశారు..! మతపరంగా మసీదూ, మత పెద్దలకూ ప్రాధాన్యత ఇస్తూనే… సంక్షేమానికీ కట్టుబడి ఉన్నమనే చెప్పే ప్రయత్నం చంద్రబాబు ప్రసంగంలో కనిపించింది.