ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు అనే చర్చ ఈ మధ్య చాలా తీవ్రంగా జరుగుతోంది. టీడీపీ నేతలే తీవ్రంగా దీన్ని ఖండించారు. అలాంటిది జరగదనీ, ఆ పరిస్థితి ఉండదంటూ కొంతమంది మంత్రులూ సీనియర్ నేతలూ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ తో పొత్తు అంశమై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం… తనదైన శైలిలో అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రాలో ఆ పార్టీతో స్నేహం తెలుగుదేశం పార్టీకి అవసరం లేదంటున్నారు. కానీ, తెలంగాణలో టీడీపీకి ఏదో ఒక పార్టీ మద్దతు కావాల్సిన అవసరం ఉందన్నారు!
ఆ రాష్ట్రంలో సొంతంగా టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవన్నారు జేసీ! కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ సాయం కోరుతోందనీ, కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇస్తే పెద్దగా తప్పేం ఉండదనీ, ఆంధ్రా ప్రజలు కూడా హర్షించే పరిస్థితి ఉంటుందని జేసీ అభిప్రాయపడ్డారు! ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని భాజపా మోసం చేసిందనీ, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్సే ఇప్పుడు హోదా ఇస్తామంటున్నప్పుడు… కాంగ్రెస్ తో కలిసి వెళ్తే తప్పేముందన్నారు. ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ అవసరం లేదు కాబట్టి… తెలంగాణలో కాంగ్రెస్ కి సహకరిస్తే పోయేదేం లేదు కదా అని చెప్పారు. కేంద్రంలో వారూ ఏపీ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని అంటున్నారు అంటూ అభిప్రాయపడ్డారు.
నిజానికి, రాష్ట్రానికో రకంగా పొత్తులు ఉండవు కదా.. ఈ విషయాన్ని జేసీ మరచిపోయినట్టున్నారు..! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఉంది. అలాగని, పొత్తులపై రాష్ట్రానికో రకంగా వ్యవహరిస్తామంటే విమర్శలు పాలౌతారు. కాంగ్రెస్ తో పొత్తు వల్ల టీడీపీకి నెగెటివ్ ప్రచారం చాలా వస్తుందనడంలో సందేహం లేదు. కానీ, ఆంధ్రా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ప్రత్యామ్నాయ జాతీయ పార్టీగా కాంగ్రెస్ మాత్రమే ప్రస్తుతానికి కనిపిస్తున్న పరిస్థితి. అయితే, ఎన్నికల కేంద్రంలో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉంటుందా… ఇతర పార్టీల మద్దతు అవసరమౌతుందా… లేదంటే, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలే బలోపేతమైన కూటిమిగా ఏర్పాడే అవకాశాలుంటాయా అనేది ప్రస్తుతం అంచనాకు అందని అంశం.
కాబట్టి, కాంగ్రెస్ తో పొత్తు చర్చను టీడీపీ నేతలు కూడా ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టే ఉన్నారు. కానీ, జేసీ మాత్రం దానిపై ఇలా స్పందిస్తూ… మరోసారి చర్చనీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికో రాజకీయ విధానాన్ని భాజపా, కాంగ్రెస్ లు అనుసరించినా చెల్లుబాటు అవుతుందేమోగానీ… కాంగ్రెస్ విషయంలో టీడీపీ అలాంటి సిద్ధాంతాన్ని అనుసరిస్తే ఇబ్బందులు తప్పవనే విషయం జేసీకి తెలిసే ఇలా మాట్లాడుతున్నారేమో తెలీదు..!