తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది..! అదేంటంటే.. ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయన్న పరిస్థితుల్లో కూడా… సీఎం కేసీఆర్ అజెండా ప్రకారం వారు వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితి..! కేసీఆర్ స్పందిస్తే… దానిపై ప్రతిస్పందిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చాక, కాంగ్రెస్ వైపు కొంత అటెన్షన్ వెళ్లింది. ప్రజలూ మీడియా ఆ పార్టీవైపు కొంత ఆసక్తిగానే చూశాయి. కానీ, ఎప్పుడైతే ‘ప్రగతి నివేదన సభ’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారో.. దాంతో మరోసారి అటువైపు తిరిగిపోయింది. అందరి దృష్టీ అటే ఉంది. దీంతో, ఇప్పుడు ఏదో ఒకటి చేసి… కాంగ్రెస్ వైపు మీడియాతోపాటు ప్రజల దృష్టిని మళ్లించుకోవడం ఆ పార్టీకి తక్షణ కర్తవ్యంగా మారిపోయింది.
అందుకే, కేసీఆర్ ప్రగతి నివేదన సభ పెడితే… త్వరలో తాము ఆవేదన సభలు నిర్వహిస్తామంటూ ఓ ప్రతిపాదనతో కాంగ్రెస్ నేతలు సిద్ధమౌతున్నారు. గాంధీభవన్ లో జరిగిన ఓ సమావేశంలో ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కేసీఆర్ సభకు ధీటుగా, అదే స్థాయిలో తెలంగాణలో ఒక భారీ సభను నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ సభకు సోనియా గాంధీని రప్పించాలనేది నేతల అభిప్రాయం! అంతేకాదు, తెరాస సర్కారు వైఫల్యాలను జిల్లా, మండల, గ్రామ స్థాయిలకు తీసుకెళ్లేలా జన ఆవేదన సభల్ని అన్ని స్థాయిల్లో నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే, ఈ సభ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనేది మరో రెండ్రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ సభ నిర్వహణ కంటే ముందుగానే తమ సభ తేదీని ప్రకటించడం ద్వారా… మీడియా దృష్టిని తమవైపు కొంత తిప్పుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం కొంతమంది నేతల్లో ఉందని సమాచారం.
నిజానికి, ఇప్పుడు కూడా కేసీఆర్ ను అనుసరిస్తున్నట్టుగానే కాంగ్రెస్ వ్యూహం ఉంది..! తెరాస భారీ సభ పెడతామని ప్రకటించిన తరువాతే, తమదీ అలాంటి సభ ఉంటుందని అంటున్నారు. వాస్తవం మాట్లాడుకుంటే… ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు అయిందే అనుకుందాం! దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందనేది పెద్ద ప్రశ్నే..? పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి లాంటివారు ఎన్నికలపై ధీమా వ్యక్తం చేస్తున్నా… రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఆ పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్. ఇప్పటికే సీట్ల కోసం నియోజక వర్గానికి కనీసం ఇద్దరు ముగ్గురు చొప్పున పోటీ పడుతున్న పరిస్థితి..! ఏరకంగా చూసుకున్నా.. తెరాస ప్రగతి నివేదన సభ నేపథ్యంలో కాంగ్రెస్ లో కొంత ఆవేదన అయితే మరోసారి వ్యక్తమౌతున్నట్టుగానే ఉంది..!