సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ… తన ఐపీఎస్ ఉద్యోగానికి.. వీఆర్ఎస్ తీసుకుంటున్నారనే విషయం బయటకు తెలియగానే… రకరకాల ఉహాగానాలొచ్చాయి. ఏపీలో ఉన్న అన్ని పార్టీల్లోనూ.. ఆయనను చేర్చేశారు విశ్లేషకులు. ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లారు కాబట్టి బీజేపీలో చేరుతారన్నారు. జగన్ పై కేసుల్లో దూకుడుగా వ్యవహరించారు కాబట్టి.. టీడీపీలో చేరుతారన్నారు. పవన్ కల్యాణ్… ఆశయాలపై ఎంతో నమ్మకం ఉంచారు కాబట్టి.. జనసేనలోకి వెళ్తారని కూడా చెప్పారు. చివరికి తేలిందేమిటంటే.. ఆయనకు.. ఏ పార్టీ కూడా.. ఇంత వరకూ.. తమ పార్టీలో చేరమని ఆహ్వానం పంపలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. వీఆర్ఎస్ ఆమోదం పొందిన తర్వాత మొదటి సమావేశంలోనే తనకు వ్యవసాయ మంత్రిని కావాలని ఉందన్న ఆయన ఆకాంక్షను కూడా.. రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోయాయా…?
లక్ష్మినారాయణ.. ముందస్తు ప్రణాళికతోనే.. ఉద్యోగానికి రాజీనామా చేసి ఉంటారని అందరూ అనుకున్నారు. రాజకీయం ప్రవేశంపై ఆయన పూర్తి స్థాయ ప్రణాళికలు వేసుకున్నారని.. నమ్మారు. ఒకరు .. ఇద్దరు కాదు.. అందరూ నమ్మేశారు. టీడీపీలో చేరుతారని.. బీజేపీ వాళ్లు.. బీజేపీలో చేరుతారని టీడీపీ వాళ్లు.. అలాగే… జనసేనలో చేరుతారని..ఈ రెండు పార్టీల నేతలు.. ఊహించేసుకున్నట్లున్నారు. తమ పార్టీలోకి రమ్మని అడిగినా ప్రయోజనం ఉండదనుకున్నారేమో.. కానీ ఎవరూ లక్ష్మినారాయణను సంప్రదించలేదట. సంప్రదించినా.. ఆయన… జిల్లా పర్యటన తర్వాత చెబుతానని చెప్పేవారు. ఇప్పుడు జిల్లాల పర్యటనలు చివరి దశకు వచ్చినట్లున్నాయి.. సెప్టెంబర్ చివరి వారంలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానంటున్నారు.
సీబీఐ మాజీ జేడీ టైమింగ్ చూస్తే.. కచ్చితంగా అంచనాతో ఉన్నారన్న భావన రాకుండా మానదు. ఎన్నికల హడావుడి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అక్టోబర్ నాటికి. అది పీక్స్‌కు చేరుతుంది. అప్పుడు రాజకీయ పార్టీలన్నీ.. పొటెన్షియల్ లీడర్ల కోసం వెదుకుతూ ఉంటాయి. లక్ష్మినారాయణ చేరుతాను అంటే.. అన్ని పార్టీలు రెడ్ కార్పెట్ వేయడం ఖాయమే. అయితే.. ఏదో ఓ పార్టీలో చేరడానికి జేడీ రెడీగా ఉన్నారా..? లేక కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది కీలకంగా మారింది. దీనిపై మరో నెల వరకూ సస్పెన్స్ తప్పదేమో..?