హైదరాబాద్: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌కు సంబంధించిన ఎయిర్ పోర్ట్ వీడియో ఫుటేజ్‌లో అతను చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించటం లేదంటూ ఆ పార్టీ దినపత్రిక సాక్షి ఇవాళ ఒక కథనాన్ని ఇచ్చింది. పక్కటెముకలు విరిగేటట్లుగా కొట్టారని ఆరోపిస్తున్నారని, అయితే అంత దెబ్బలు తగిలితే ఆ మేనేజర్ ఆ రోజు రాత్రిదాకా ఎలా పనిచేశాడని ప్రశ్నించింది. మరుసటి రోజుకూడా అతను విధులకు హాజరయ్యాడని పేర్కొంది. అతని సోదరుడు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు కాబట్టే అక్కడ చేర్పించి తమకనుగుణంగా నివేదిక తయారు చేయించారని ఈ కథనంలో ఆరోపణ. మరోవైపు ఈ వ్యవహారాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కూడా ముడిపెట్టింది సాక్షి పత్రిక. గతంలో బయటకొచ్చిన లోకేష్ ఫోటోలనే మళ్ళీ ప్రచురించి ఆధారాలంటే ఇలా ఉండాలని రాసింది. ఇక్కడ ప్రచురించిన నాలుగు ఫోటోలలో మొదటిదానిలో లోకేష్ ఒక చేతిలో మగువ, మరో చేతిలో మందు గ్లాసు పట్టుకుని ఉన్నారు. రెండో దానిలో విదేశీ వనితతో ఆటపాటలు, మూడోదానిలో ఆటలతో అలసి సొలసి లోకేష్ భుజాలపై సేద తీరుతున్న ఇద్దరు భామలు, నాలుగోదానిలో విదేశీ భామలతో స్మిమ్మింగ్ పూల్‌లో లోకేష్ సయ్యాటలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ ఫోటోలు ఒరిజినల్వేనా, మార్ఫింగ్ చేసినవా అనేది తెలియటంలేదు.