తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. అత్యంత గుప్తమైన రాజకీయాలు నడుపుతున్నారు. ఢిల్లీ వెళ్తారు.. వస్తారు..గవర్నర్‌ను కలుస్తారు..మళ్లీ ఢిల్లీ వెళ్తారు.. మళ్లీ వస్తారు.. మళ్లీ గవర్నర్‌ను కలుస్తారు.. ఇలా ఓ సైకిల్ ప్రకారం ఇంత కాలం రాజకీయాలు నడిపారు. ఇప్పుడు కొత్తగా.. ఈ సైకిల్లో.. బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని కూడా కలిపారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన కేసీఆర్.. ఎడతెరిపి లేని సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారుల బదిలీల దగ్గర్నుంచి… కొంగలకలాస్ సభ ఏర్పాట్ల సమీక్ష వరకూ చాలా చేస్తున్నారు. ఈ మధ్యలో అనూహ్యంగా.. ఆయన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
కేసీఆర్ స్వయంగా.. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేశారు. ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానంతో… బీజేపీ ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఒక్క రాజాసింగ్‌ను మినహా మిగిలిన నలుగుర్ని కేసీఆర్ ఆహ్వానించారు. వారంతా.. కేసీఆర్ ఆహ్వానించిన గంటలో ప్రగతి భవన్లో వాలిపోయారు. నిజానికి కిషన్ రెడ్డి సహా.. కొంత మంది ఎమ్మెల్యేలు కొద్ది రోజుల కిందట… ప్రగతి భవన్ వద్ద ధర్నా చేశారు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.. ఎందుకంటే.. కేసీఆర్ ఆపాయిమెంట్ ఇవ్వడం లేదనేది కారణంగా చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్.. పిలిచి మరీ ఇంటికి ఆహ్వానించడంతో.. గంటలోపే నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్లో ప్రత్యక్షమయ్యారు. వారితో.. తన ఢిల్లీ పర్యటన గురించి.. ముందస్తు ఎన్నికల గురించి… కేసీఆర్ చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.
సమావేశం ముగిసిన తర్వాత.. బీజేపీ సాయంత్రం.. అత్యవసరంగా తమ కోర్ కమిటీని సమావేశపరుచుకున్నారు. కేసీఆర్ తమ ముందు ఉంచిన అన్ని అంశాలపై చర్చించుకున్నారు. కానీ.. ఆ అంశాలేమిటన్నదానిపై.. క్లారిటీ లేదు. ఢిల్లీ బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కేసీఆర్.. ఇంత వరకూ తెలంగాణ బీజేపీ నేతల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ.. ముందస్తుకు వెళ్తూ.. వెళ్తూ. ఆ పార్టీ ఎమ్మెల్యేల్ని ప్రగతి భవన్‌కు పిలిపించుకోవడంతో.. పొత్తుల అంశంపై ఏమైనా చర్చలు జరిపారా అన్న చర్చ కూడా జోరుగానే వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే బీజేపీ నేతలు కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసలు బీజేపీతో పొత్తు తప్పించుకోవడానికే.. ముందస్తుకు వెళ్తున్నారని కొంత మంది అంటున్నారు. అలాంటిది పని గట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు ప్రగతి భవన్‌కు ఆహ్వానించినట్లు..?