కేసీఆర్ ముందస్తు సన్నాహాలకు గట్టిగా కౌంటర్ ఇద్దామనుకున్న తెలంగాణ పీసీసీ.. తాము సీరియస్ ప్లేయర్లం కాదన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లింది. అత్యవసర సమావేశం అంటూ.. ముఖ్యనేతలందరికీ పిలుపునిచ్చారు. కానీ ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్స్, డీసీసీ అధ్యక్షులను ఆహ్వనించారు. వీరిలో చాలా మంది రాలేదు. ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నామని చెప్పినా.. ముఖ్య నేతలు డుమ్మాకొట్టడం … సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాకు కూడా మింగుడుపడలేదు. గైర్హాజరైన వారిలో డీకే అరుణ ,కోమటిరెడ్డి బ్రదర్స్ ,షబ్బీర్ అలీ కూడా ఉన్నారు.
కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంన్న దామోదర రాజనర్సింహ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన కుంతియా మొదట్లోనే గొడవపడి వెళ్లిపోయారు. బస్సుయాత్రకు ఇన్చార్జ్గా వ్యవహరించిన మరో ముఖ్య నేత.. ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి తన నియోజకవర్గ నేతలతో నిర్మల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇక అసలు పిలిచినా.. ముఖ్య నేతలు రాలేదని.. కొంత మంది బాధపడుతూ ఉంటే.. వచ్చిన వాళ్లపై.. మరికొంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవీ లేదు. పీసీసీ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు ,ఏఐసీసీ కార్యదర్శులు , మాజీ పీసీసీ అధ్యక్షులకి మాత్రమే ఆహ్వానం ఉంది. వీటిలో ఏ ఓక్క పదవి లేని రేవంత్ రెడ్డి ని ఏలా ఆహ్వనించారని కొందరు నేతలు ఉత్తమ్‌ను నేరుగా ప్రశ్నించారు.
ఈ విషయాన్ని ఎలాగో సర్దుబాటు చేసి.. సమావేశం ప్రారంచగానే.. ఉత్తమ్ శక్తి యాప్ ,బూత్ కమిటీ ల గురించి మాట్లాడటం ప్రారభించారు. వెంటనే కొంత మంది పీసీసీ సభ్యులు కల్పించుకుని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వైపు టీఆర్ఎస్ ఎన్నికలకు పరుగులు పెడుతూంటే.. యాప్‌ల గురించి చర్చలు అవసరమా అంటూ మండి పడ్డారట. ఇన్ని గందరగోళాల మధ్య.. ఎప్పటిలానే తూ..తూ మంత్రంగా సమావేశాన్ని ముగించారు. ఏవో రెండు నిర్ణయాలు తీసుకున్నామనిపించారు. మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ మాత్రం… గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేసి.. ఇంటికెళ్లిపోయారు. కాంగ్రెస్ పోరాడుతున్న తీరు చూసి… ఆ పార్టీ నేతలు కూడా… ముందస్తు కాదు కదా.. వెనకస్తు ఎన్నికలొచ్చినా.. ఎవరూ మారరని జోకులేసుకున్నారు.