టీడీపీ అధినేత చంద్రబాబుది కాంగ్రెస్ జీన్స్. ఆయన యూత్ కాంగ్రెస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత టీడీపీలో చేరి.. కరుడుగట్టిన కాంగ్రెస్ వ్యతిరేకగా మారారు. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి.. అలా ఉండక తప్పని పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు. పోటీ పడే పరిస్థితిలో కూడా లేదు. పైగా..టీడీపీకి అంతో.. ఇంతో సహాయకారిగా ఉండాలనుకుంటోంది. అందుకే చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీపై ఎక్కడ లేని సానుభూతి కనిపిస్తోంది. ఆ పార్టీపై విమర్శలు పూర్తిగా తగ్గించేయడమే కాదు కాస్తంత పాజిటివ్ ధోరణిలో మాట్లాడుతున్నారు. అయితే ఇది ఒక్క ప్రత్యేకహోదాకే పరిమితం చేస్తున్నారు.
ముస్లింమైనార్టీల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తప్పు దిద్దుసుకున్నదని ప్రకటించారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీకి.. ప్రత్యేకహోదా ఇస్తామని చెబుతోందని గుర్తు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీపై ఎంతగా విమర్శలు చేసినా తప్పు లేదు కానీ.. కాంగ్రెస్ పార్టీని మాత్రం .. ప్రజల ముంందు తప్పు దిద్దుకున్న పార్టీగా నిలబెట్టే ప్రయత్నం చేయడమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. అయితే చంద్రబాబు ఇలా మాట్లాడటం వెనుక పక్కా వ్యహం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో కాంగ్రెస్ తప్పక మద్దతిస్తుంది. ఆమోదయోగ్యమైన నేత కోసం పట్టు బడుతుంది. అది చంద్రబాబే కావొచ్చు కూడా. ఈ కోణంలో మాత్రమే కాదు.. ప్రత్యేకహోదా సాధనకు కాంగ్రెస్ తప్ప మరో మార్గం లేదని.. ప్రజలకు తెలియచెప్పడానికి కూడా.. ఆ భాషను ఎంచుకున్నట్లు మరికొంత మంది భావిస్తున్నారు.
అదీ కాకుండా… జరిగింది మైనార్టీల సదస్సు.. సహజంగా మైనార్టీలు.. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకులు. గత ఎన్నికల సమయంలో వారంతా వైసీపీ వైపు వెళ్లారు. ఇప్పుడు వైసీపీ.. బీజేపీకి దగ్గరవుతూండటంతో… మళ్లీ ఇతర పార్టీల వైపు చూడాల్సిన పరిస్థితి. కొంత మంది సంప్రదాయంగా.. టీడీపీకి బద్ద వ్యతిరేకులుగా ఉంటారు. అలాంటి వారిని మళ్లీ వైసీపీ వైపు వెళ్లనీయకుండా.. కాంగ్రెస్ దగ్గరే ఆగేలా చేసేందుకు… చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. మొత్తానికి మైనార్టీ సదస్సుతో చంద్రబాబు కాంగ్రెస్‌పై తన విధానంలో స్పష్టమైన మార్పును చూపించినట్లయింది.