రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగింది అంటూ మోడీ సర్కారుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం లెక్కలు బయటపెట్టాలంటూ ఈ మధ్య ప్రతీ సభలోనూ రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. రాఫెల్ ఆరోపణల్నే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. అయితే, ఈ విమర్శల్ని తిప్పి కొట్టేందుకు భాజపా కూడా సిద్ధపడింది. ఇదే అంశమై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు.
రాఫెల్ విమానాల గురించి ఈ మధ్య రాహుల్ తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారనీ, ఇప్పటివరకూ ఏడు రకాల ధరలు చెప్పారనీ, అన్ని రకాలు ఎలా ఉంటాయంటూ జైట్లీ ఎద్దేవా చేశారు. రాఫెల్ ఒప్పందంపై చర్చ నర్సరీ స్కూల్లో చర్చలా మార్చేశారన్నారు. 2007లోనే ఈ విమానాలను కొనేందుకు ఫ్రాన్స్ తో ఒప్పందం కుదిరిందన్నారు. 36 యుద్ధ విమానాల కొనుగోలు డీల్ లో ప్రభుత్వం మాత్రమే ఉందనీ, ప్రైవేటు పార్టీలకు ఆస్కారం లేదని జైట్లీ చెప్పారు. మామూలు విమానానికీ, యుద్ధ విమానానికి ఉన్న తేడా రాహుల్ గాంధీ గుర్తించలేరని విమర్శించారు. అంతేకాదు, రాఫెల్ విమానాల విషయంలో యూపీయే ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసిందో చెప్పాలనీ, నిజాలని రాహుల్ ఎందుకు దాచి పెడుతున్నారంటూ అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాలు ఆయనకి అర్థం కావన్నారు.
రాఫెల్ డీల్ ఆరోపణలపై నేరుగా సమాధానం చెప్పకుండా… చుట్టూ తిరిగి రాహుల్ వ్యక్తిగతం వైపు చర్చను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు జైట్లీ. వాస్తవ ధర కంటే అత్యధికంగా చెల్లింపులు చేశారనే ఆరోపణలు ప్రభుత్వంపై వస్తుంటే… వాటికి సమాధానాలు చెప్పాలి. అంతేగానీ… రాహుల్ కి అవగాహన లేదు, విమానాల మధ్య తేడాలు తెలీదు అంటూ జైట్లీ స్పందించడం ఆశ్చర్యం. అది అప్రస్తుత చర్చ. మోడీ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తే… ఎప్పుడూ యూపీయే హయాంలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం ఎందుకు ఆలస్యమైందని ఆయన ప్రశ్నించడం కూడా పక్కతోవ పట్టించే వ్యాఖ్యలానే ఉంది. యూపీయే హయాంలో ఆలస్యానికి కారణాలుంటే వాటిని ఇప్పుడు బయటపెట్టొచ్చు. దాంతో భాజపా పొలిటికల్ మైలేజ్ కూడా పెరుగుతుంది కదా!
ఇదే కాదు… భాజపా ప్రభుత్వంపై వినిపించే ఏ విమర్శలైనా, ఆరోపణలైనా తిప్పి కొట్టడానికి వారు అనుసరిస్తున్న రివర్స్ స్ట్రాటజీ ఇదే ! ఏపీ విభజన హామీల విషయం తీసుకున్నా ఇదే పంథా. ఇచ్చిన హామీలు వారు అమలు చేయకపోగా… కేంద్రం నుంచి నిధులను తీసుకోవడం రాష్ట్రం విఫలమైందని, కేంద్రం ఇచ్చిన నిధుల్లో అవినీతి జరిగిపోయిందని ఉల్టా మాట్లాడుతున్నారు.