నందమూరి హరికృష్ణ జీవితంలో విడదీయరాని భాగం చైతన్యరథం. ఇప్పటికీ అందరూ ఆయనను చైతన్యరథ సారధిగానే ఎక్కువగా సంబోధిస్తూంటారు. ఆ చైతన్యరథంతోనే ఆయనకు వీడ్కోలు పలకాలని.. కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఉపయోగించిన ఆ చైతన్యరథం..నిన్నామొన్నటి వరకు.. నాచారంలోని రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో శిథిల స్థితిలో ఉంది. అయితే… ఎన్టీఆర్ బయోపిక్ మూవీ కోసం.. దాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఆ చైతన్యరథంపై కొన్ని సన్నిశాలు కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం అది వాడకానికి అనువుగా ఉండటంతో దానిపైనే.. హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.
తెలుగుదేశం పార్టీ అభిమానులకు మాత్రమే కాదు.. తెలుగు ప్రజలందరికీ.. హరికృష్ణ అంటే.. ముందుగా గుర్తొచ్చేది చైతన్యరథమే. కొత్త తరానికి కాకపోయినా.. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచం మొత్తానికి చాటిన ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంలో పరిణామలను చూసిన.. తెలుసుకున్న వారందరికీ… హరికృష్ణ అంటే.. చైతన్యరథ సారధిగానే అందరికీ తెలుసు. తండ్రిని ఆంధ్రప్రదేశ్ నలుమూలలా తిప్పి.. తెలుగుదేశం జనప్రభంజనంలో భాగమయ్యాడు. రథసారధిగా పేరు తెచ్చుకున్నాడు. అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇప్పుడు ఆ రథంపైనే ఆయనను.. స్వర్గానికి సాగనంపాలని.. కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దాని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. శోకతప్త హృదయంతో.. ఆయనకు చైతన్యరథంతోనే నివాళి అర్పించాలని నిర్ణయించారు. ఏ చైతన్యరథం అయితే.. తనను చరిత్ర పుటల్లో నలిపిందో.. అదే చైతన్యరథంపై.. హరికృష్ణ అంతిమయాత్ర సాగడం… అభిమానుల్ని కలచి వేసే అంశమే. అయినా అదే గొప్ప నివాళిగా కూడా భావిస్తున్నారు.
హరికృష్ణ అంత్యక్రియలు మొదట… ఫామ్‌హౌస్‌లో నిర్వహిద్దామని కుటుంబసభ్యులు భావించినప్పటికీ.. తర్వాత వివిధ కారణాలతో… జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించాలని నిర్ణయించారు. మాసాబ్ ట్యాంక్‌లోని ఎన్టీఆర్ ఇంటి నుంచి అంతిమయాత్ర సాగనుంది. అధికార లాంఛనలాతో వీడ్కోలు పలకాలని..తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అభిమానుల సందర్శనార్థం ఎన్టీఆర్ట్రస్ట్ భవన్‌లోనూ కాసేపు పార్ధీవదేహాన్ని ఉంచే అవకాశం ఉంది.