హరికృష్ణ తన బాల్యంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసినప్పటికీ, టీనేజ్ అయిపోయాక హీరోగా ప్రయత్నించలేదు. అసలు హీరోగా పరిచయం అవ్వాల్సిన వయసులో కానీ హీరోలా చేయాల్సిన వయసులో కానీ నటనకు దూరంగా ఉండిపోయారు. అలాంటి హరికృష్ణ ని మళ్లీ హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ కొట్టిన ఘనత వైవిఎస్ చౌదరికి చెందుతుంది. అసలు హరికృష్ణ ని హీరో గా తీసుకోవాలని ఎందుకు అనిపించింది అనే ప్రశ్నకు ఒక మీడియా ఇంటర్వ్యూలో ఈ రోజు సమాధానమిచ్చాడు వైవిఎస్ చౌదరి.
వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ, ” కృష్ణావతారం , తల్లా పెళ్ళామా, తాతమ్మ కల, రామ్ రహీం లాంటి సినిమాలలో నటించిన తర్వాత నటనకి బ్రేక్ ఇచ్చారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఆయనను మళ్ళీ నటించ వచ్చు కదా చాలాసార్లు అడిగినప్పటికీ, హరికృష్ణ గారు సున్నితంగా తిరస్కరించారు. అయితే నాగార్జునగారితో సీతారామరాజు సినిమా తీసేటప్పుడు ఒక పాత్రకు హరికృష్ణ గారు అనుకుని నాగార్జునకు చెప్పగానే ఆయన కూడా ఒప్పుకున్నాడు. దీంతో హరికృష్ణ సంప్రదిస్తే బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి బ్యానర్లో కచ్చితంగా నటిస్తానని కథ కూడా వినకుండానే ఒప్పుకున్నారు. అలా ఆ సినిమా హిట్ అయ్యాక, నామీద ఆయనకి మొదటి నుంచి ఉన్న నమ్మకం మరింత పెరగడంతో ఆయన ప్రధాన పాత్రగా లాహిరి లాహిరి లాహిరి లో సినిమా తీశాను. ఈ సినిమా విజయవంతమైన తర్వాత, రాజకీయంగా ఈయన ఎక్కడైతే పోటీచేసి ఓడిపోయాడో, అక్కడే ఒక పెద్ద ఫంక్షన్ చేసి అక్కడ అభిమాన సముద్రాన్ని ఆయనకు చూపించి, ఆయనను మరింత ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, అదే ఫంక్షన్లో ఆయనను సోలో హీరోగా పెట్టి సీతయ్య సినిమా ఆనం చేయడం జరిగింది” అని చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా, హరికృష్ణ ని ఈ తరం ప్రేక్షకులకి హీరోగా పరిచయం చేసిన ఘనత మాత్రం వైవిఎస్ చౌదరి కే దక్కుతుంది. వైవిఎస్ చౌదరి మాటల్లో చెప్పాలంటే, 48 ఏళ్ల వయసులో, కమర్షియల్ సినిమాలో హీరోగా పరిచయమై హిట్ సాధించిన నటుడు హరికృష్ణ మాత్రమే.