అన్నగారి బిడ్డగా అబాలగోపాలం.. ఆత్మీయతకు నోచుకున్న నందమూరి హరికృష్ణ..ఆఖరి పయనం.. తెలుగుదేశం పార్టీ జెండా తోడుగానే సాగింది. అంతిమయాత్ర ప్రారంభానికి ముందు హరికృష్ణ పార్ధీవదేహాన్ని ఆయన బావ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్ మోశారు. వేలాది మంది నందమూరి అభిమానులు.. వెంట రాగా… అంతిమాయత్ర సాగింది. జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానంలో.. ఆయనకు వీడ్కోలు పలికారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ.. హరికృష్ణ ఆత్మీయులందరూ.. కడ చూపుకు దూరభారం అనుకోకుండా వచ్చారు. చివరి సారి చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వెళ్లిపోయావా తమ్ముడా అని మథన పడ్డారు. అన్నగారి బిడ్డను సాగనంపుదామని.. వేల మంది ఏపీ నుంచి కూడా తరలి వచ్చారు. వారంతా కన్నీటి వీడ్కోలు పరకగా.. నందమూరి హరికృష్ణ దిగంతాలకు పయనమయ్యారు. ఒక మెరుపు అలా వచ్చి అలా మాయమైననట్లు.. ఆయన జీవిత ప్రస్థానం అలా ముగిసింది.
ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే.. ఆయనకు చేదోడు వాదోడుగా.. ఉన్నారు. రామకృష్ణా సినీ స్టూడియోస్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నారు. అబిడ్స్ లోని ఎన్టీఆర్ ఎస్టేట్ ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆయన ప్రచార రథానికి సారధి అయ్యారు. ఎప్పటికప్పుడు కనిపట్టుకుని ఉన్నారు. ఆయన అడుగులో అడుగు వేశారు. సినిమాల్లో ఉన్నా.. పార్టీలో ఉన్నా.. ఎన్టీఆర్ మాటే వేదవాక్కు. ఎన్టీఆర్ ను కలిసేందుకు వచ్చే ప్రతి ప్రముఖుడికి హరికృష్ణ పరిచయమే. ఎన్టీఆర్ బిడ్డగానే అనితర సాధ్యమైన గుర్తింపుతో ఇప్పటికీ… ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం… అంత తేలికైన విషయం కాదు. అది హరికృష్ణకు సాధ్యమైంది.
అన్నగారి బిడ్డగా ఆయన అడుగు జాడల్లో నడవాలని.. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని.. అనుకున్నది సాధించేందుకు అన్నగారినే ఆదర్శంగా తీసుకోవాలనే సంకల్పాన్ని హరికృష్ణ.. తెలుగు తమ్ముళ్లందరికీ ఇచ్చి వెళ్లాడనుకోవాలి. అన్నగారి బిడ్డగా .. ఆయన ప్రతీ ప్రస్థానంలో తనదైన ముద్ర వేసుకున్న హరికృష్ణ… అందరికీ ఆత్మీయుడే. ఆవేశ పరుడైనా.. భావోద్వేగాల్ని మనసులో దాచుకోలేని వ్యక్తి అయినా.. వ్యక్తిగత సంబంధాల్ని ఆయన ఎప్పుడూ తేలికగా తీసుకోలేదు. అందుకే ఆయనకు శత్రువులంటూ ఎవరూ లేరు. ఆయన అజాత శత్రువు. అందరూ మనసులో అనుకుంది ఒక్కటే…. “మళ్లీ ఎప్పుడొస్తావు… మిత్రమా..?”