కథ, కథనాలు ఎలాగూ కొత్తగా ఉండాలి. దాంతోపాటు లొకేషన్లు కూడా అదిరిపోవాలి. పాత కథని కొత్తగా చెప్పే ప్రయత్నంలో లొకేషన్లు మరింత ముఖ్యం. అందుకే… చిత్రబృందాలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇది వరకెప్పుడూ చూడని దృశ్యాల్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి అహర్నిశలూ శ్రమిస్తున్నాయి. రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల కోసం.. లొకేషన్ల వేట జరిపారు బోయపాటి శ్రీను. ఎన్నో ప్రదేశాల్ని రెక్కీ చేసి చివరకు ఓ సరికొత్త ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అదే.. అజర్ బైజాన్. ఇదో దేశం పేరు. తూర్పు ఐరోపాలోని అతి పెద్ద దేశాల్లో ఇదొకటి. ఇప్పుడిప్పుడే పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందుతోంది. ఇక్కడ కనీ వినీ ఎరుగని లొకేషన్లు ఉన్నాయట. వాటి మధ్య రామ్ చరణ్ సినిమా షూటింగ్ జరగబోతోంది. 30 రోజుల సుదీర్ఘమైన షెడ్యూల్ కోసం చిత్రబృందం అజర్ బైజాన్ వెళ్లిపోయింది. రామ్ చరణ్ మరో రెండు రోజుల్లో అక్కడికి చేరుకుంటారు. నెలరోజుల పాటు జరిగే ఈ భారీ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. బోయపాటి శ్రీను ఏరి కోరి ఎంచుకున్న ఈ సరికొత్త దేశంలో ఎన్ని కొత్త అందాల్ని చూపించబోతున్నారో..???