దినదిన గండం .. నూరేళ్లు ఆయుష్షు అన్నట్లుగా.. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయింది. కుమారస్వామి ఢిల్లీ వెళ్లి రాహుల్‌ని కలిశారు. తన పాలనను.. కాంగ్రెస్ అధ్యక్షుడు అభినందించినట్లు చెప్పుకున్నారు. కానీ నిజంగా కర్ణాటకలో పరిస్థితి అలా లేదు. రేపు కూడా ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా అన్న సందేహం అక్కడి ప్రజల్లో ఉంది. ఈ సారి గేమ్‌చేంజర్‌గా అందరి నోళ్లనూ సిద్ధరామయ్యే నానుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రజలు కోరుకుంటే తాను మళ్లీ ముఖ్యమంత్రినవుతానని ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత.. యూరప్ పర్యటనకు బయలు దేరబోతున్నారు.
సాధారణంగా కర్ణాటక రాజకీయ నేతలు… రాజకీయాలుక సంబంధించి తెర వెనుక వ్యవహారాలు చక్క బెట్టుకోవాలనుకుంటే.. విదేశాలు వెళ్లిపోతారు. ఇప్పుడు సిద్ధరామయ్య కూడా అదే చేస్తున్నారన్న అనుమానాలు జేడీఎస్ వర్గాల్లో ప్రారంభమయ్యాయి. సిద్ధు విదేశాలకు వెళ్లిన వెంటనే ఆయన మద్దతుదారులు బీజేపీలో చేరుతారని.. కాషాయ ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన పరోక్షంగా సహకరించేందుకే ఇలా చేస్తున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే బీజేపీ నేత యడ్యూరప్ప మంట రాజేస్తున్నారు. చాలా మంది కాంగ్రెస్ కీలక నేతలు తమ పార్టీలో చేరనున్నారని పదే పదే ప్రకటిస్తున్నారు. అంతర్గత విభేదాల వల్ల ఒకవేళ సర్కారు పడిపోతే మాత్రం దానికి తాను బాధ్యత వహించనని ముందే తప్పు తనది కాదని చెప్పుకుంటున్నారు.
మరో 15 రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయ్. దీంతో కర్ణాటక రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోబోతోంది.. అందరూ అనుకుంటున్నట్లు యూరప్ టూర్లో సిద్ధరామయ్య బాంబ్ పేల్చుతారా.. అసలు ఏం జరగబోతోంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తమ్మీద వంద రోజుల ప్రభుత్వ పాలనలో కుమారస్వామి ఏ ఒక్క రోజు హ్యాపీగా లేరు అన్నది చాలామంది అభిప్రాయం. తన పదవిని ఐదేళ్ల పాటు ఉండేలా.. కుమారస్వామి.. రాజకీయాన్ని కాక దేవుళ్లను మొక్కుకుంటున్నారు. పదవి చేపట్టిన వంద రోజుల్లో ఆయన యాభై ప్రసిద్ధ ఆలయాలను సందర్శించారు. కొసమెరుపేమిటంటే.. ఇవాళ విజయవాడల కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోబోతున్నారు.