పనియే పరమావధిగా హరికృష్ణ కుమారులు నందమూరి కల్యాణ్‌రామ్, జూ. ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. తండ్రి తరలిరాని లోకాలకు వెళ్లి మూడు రోజులు కూడా కాలేదు. హరికృష్ణ హఠాన్మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు తమ్ముళ్లు శోక సంద్రం లోంచి బయటకు రాలేదు. ఇక, హరికృష్ణ తనయుల పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. తండ్రి మరణ వార్తను తట్టుకుని సాధారణ స్థితికి చేరుకోవడానికి కొన్ని రోజులు పడుతుందని… ఆ తర్వాతే కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ సినిమా షూటింగులకు హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ, రేపటి (శనివారం) నుంచి ఎన్టీఆర్… సోమవారం నుంచి కల్యాణ్‌రామ్ తమ తమ సినిమా షూటింగులకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ తాజా షెడ్యూల్ రేపటి నుంచి మొదలవుతోంది. కల్యాణ్‌రామ్ హీరోగా కె.వి. గుహన్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మిస్తున్న సినిమా తాజా షెడ్యూల్ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. నిర్మాతలకు ఎటువంటి నష్టం కలగకూడదని అన్నదమ్ములు ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నార్ట!