తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికలకు అధికార పార్టీ తెరాస సిద్ధమౌతున్న తీరుగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అన్నట్టుగానే సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందనేది ప్రశ్నార్థకంగానే మారింది! ముందస్తు ఎన్నికలు వస్తాయని టి. భాజపా నేతలు కూడా బలంగా నమ్ముతున్నారా..? ఒకవేళ వస్తే, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా..? ఇలాంటి సందిగ్ధం నేతల్లోనే ఉందనేది వాస్తవం. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కేంద్ర నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్ర పార్టీ వర్గాలకు పూర్తిగా అర్థం కాకపోవడం గమనించాల్సిన అంశం! ఇదే అంశాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్లినట్టు సమాచారం.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరుగుతున్న ఆర్.ఎస్.ఎస్. బైఠక్ లో పాల్గొనేందుకు అమిత్ షా వచ్చారు. ఆయన్ని శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డితోపాటు కొంతమంది మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమయంలో కాసేపు సమయం దొరకడంతో… టి. నేతలు తమ ఆవేదనను అమిత్ షా ముందుంచారట! ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్లు వరుసగా ఇస్తున్నారనీ, తెలంగాణకు సంబంధించిన కీలక నిర్ణయాలపై చకచకా స్పందిస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారట. దీన్నో ఫిర్యాదుగా కాకుండా… కేంద్రం తీరు వల్ల రాష్ట్ర ప్రజలకు భాజపాపై వేరే సంకేతాలు వెళ్తాయనే కోణంలోనే చెప్పారట. కేసీఆర్ విషయంలో జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న తీరు వల్ల రాష్ట్రంలో తాము ఎలా స్పందించాలనే స్పష్టత లేకుండా పోతోందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి.. ‘చూద్దాం’అన్నట్టుగా అమిత్ షా స్పందించారని అంటున్నారు!
నిజమే, ఈ మధ్య ఢిల్లీలో ఎక్కువగా కేసీఆర్ కనిపిస్తున్నారు. కేసీఆర్ కు అత్యంత అనుకూలంగానే కేంద్రం నిర్ణయాలు చకచకా జరిగిపోతున్నాయి. తెలంగాణ కొత్త జోనల్ విధానాన్ని కేంద్రం ఓకే చేసేసింది. ఇప్పుడు, హైకోర్టు విభజన విషయంలో కూడా త్వరలోనే ఏదో ఒక నిర్ణయం వస్తుందనే పరిస్థితే కనిపిస్తోంది. అయితే, తెలంగాణకు అనుకూలంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను ఎవరూ తప్పుబట్టడం లేదుగానీ… ఈ క్రమంలో రాజకీయ పార్టీగా రాష్ట్రంలో భాజపా నేతలు ఎలా స్పందించాలనేదే చర్చ. భాజపాకి తెరాస మిత్రపక్షమూ కాదు. పోనీ, రాజకీయంగా శతృపక్షం అవునో కాదో రాష్ట్ర నేతలకు తెలీదు. అలాగని, భాజపాతో పొత్తు ఉండే విధంగా కేసీఆర్ తీరు ఉంటోందా అంటే అదీ లేదు! భాజపాతో అంశాలవారీగా మాత్రమే సయోధ్యగా ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలకు స్పష్టత కొరవడటం అనేది సహజమే! మరి, ఈ పరిస్థితిని భాజపా జాతీయ నాయకత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.