కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ సెలవు తీసుకున్నారు! అంటే, ప్రతీయేటా ఓ రెండువారాలపాటు ఇలా సెలవు తీసుకుంటూ ఉండటం ఆయనకి అలవాటు. గత ఏడాది, అంతకుముందు ఇలానే సెలవుపై విదేశాలకు వెళ్లినప్పుడు… కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైన చర్చ జరిగింది. కీలకమైన సమయంలో సెలవు పేరుతో ఆయన వెళ్లిపోవడం సరికాదంటూ కొంతమంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మానస సరోవర యాత్ర పేరుతో దాదాపు 15 రోజులు ఆయన లీవ్ పెట్టేశారు. ప్రస్తుతం ఆయన యాత్రలో ఉన్నారు! అయితే, ఈ యాత్ర వెనక రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయనేది తెలుస్తోంది!
తాను హింధువునే, భక్తుడినే అని ప్రచారం చేసుకునే పని చాన్నాళ్ల కిందటే రాహుల్ మొదలుపెట్టారు. గత ఏడాది గుజరాత్ లోని సోమ్ నాథ్ దేవాలయానికి వెళ్లారు. ఆ తరువాత, కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆయన ఫోకస్ అంతా గుళ్లూ గోపురాల చుట్టూనే తిరిగింది. తాజా మానస సరోవర యాత్ర కూడా మొక్కు చెల్లించుకోవడం కోసమే ఆయన ఇంతకుముందే చెప్పారు! ఆ మధ్య తాను ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపానికి గురైంది, ఆ సమయంలో అంతా అయిపోయిందని భయపడ్డారనీ, సరిగ్గా అప్పుడే శివుడిని దర్శించుకోవాలని అనిపించిందనీ, అందుకే ఈ యాత్ర అని రాహుల్ చెప్పినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజకీయంగా చూసుకుంటే… హింధుత్వ కార్డుతో భాజపా భారీ రాజకీయ ప్రయోజనాలు పొందుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో మోడీని ఎదుర్కోవాలంటే, కాంగ్రెస్ కి కూడా సాఫ్ట్ హింధుత్వ ఇమేజ్ అవసరం. అందుకే, గుళ్లూ గోపురాలూ అంటూ రాహుల్ చక్కర్లు కొడుతున్నారు.
అయితే, తాజా పర్యటన నేపథ్యంలో కొంతమంది సీనియర్లు భిన్నాభిప్రాయంతోనే ఉన్నారట! ఎన్నికలకు సిద్ధమౌతున్న ఈ తరుణంలో దాదాపు పదిహేను రోజులపాటు పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేకపోతే ఎలా అనేది కొంతమంది అభిప్రాయంగా తెలుస్తోంది. మోడీ వైఫల్యాలను ఎండగట్టాల్సిన ఈ సమయంలో బ్రేక్స్ తీసుకుంటే, భాజపా దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుందనేది కొందరి అభిప్రాయం! దీనికి తగ్గట్టుగానే భాజపా నేతలు రాహుల్ గాంధీ పర్యటనపై విమర్శలు మొదలుపెట్టేశారు. అయితే, మానస సరోవర యాత్ర కాబట్టి… హింధూ అనుకూల సంకేతాలు ఈ పర్యటన ద్వారా ప్రజల్లోకి వెళ్తాయనేది పార్టీలో జరుగుతున్న చర్చ! పేరేదైనా కావొచ్చుగానీ… రాహుల్ గాంధీ మరోసారి సెలవు తీసుకున్నారన్నది వాస్తవం.