ఈవారం విడుదలైన `@నర్తనశాల` `పేపర్ బాయ్` విడుదలకు ముందే ఆశలు, అంచనాలూ రేపాయి. `@నర్తనశాల`కి ముందు నుంచీ పాజిటీవ్ బజ్ వినిపించింది. `ఛలో` తరవాత నాగశౌర్య సొంత సంస్థలో రూపొందిన సినిమా ఇది. సినిమా కోసం, ప్రమోషన్ల కోసం బాగా ఖర్చు పెట్టారు. పాటలూ ఓకే అనిపించుకున్నాయి. అందుకే.. ఆ ఆశలు. `పేపర్ బాయ్`దీ అదే పరిస్థితి. సంపత్‌నంది లాంటి హ్యాండ్ ఈసినిమాలోఉంది. దానికి తోడు… అల్లు అరవింద్ చేతులు కలిపి ఈ సినిమాకి కొత్త క్రేజ్తీసుకొచ్చారు. విడుదలకు ముందు ప్రభాస్ లాంటి హీరోలతో విషెష్ చెప్పించి.. ప్రమోషన్లు పెంచారు. తీరా చూస్తే రెండు సినిమాలూ బోల్తా కొట్టాయి. అంచనాలకు తగినట్టు సినిమా లేకపోవడంతో తొలిరోజే వసూళ్లలో తేడా కొట్టేసింది.
అయితే ఈ రెండు సినిమాల్లో ఓ ఉమ్మడి లక్షణం కనిపించింది. సినిమా పరాజయానికి అదే కీలకం కాకపోయినా… తనూ ఓ చేయి వేసిందని చెప్పుకోవాలి. ఈ రెండు సినిమాలకూ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. తెరపై క్వాలిటీ కనిపించింది. కానీ.. ఆర్టిస్టులే తేలిపోయారు. `నర్తన శాల` మేకింగ్ విషయంలో నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారు.కానీ. హీరో స్నేహితుల్లో గానీ, హీరోయిన్ ఇంటి సభ్యుల్లో గానీ (అజయ్‌ని మినహాయిస్తే.) తెలిసిన మొహాలు చాలా తక్కువ. దానికి తోడు ఫేడవుట్ అయిపోయిన ఆర్టిస్టుల్ని తీసుకొచ్చారు. తెర ఎంత రిచ్‌గా కనిపిస్తున్నా… ఆ నటీనటులు, వాళ్ల పాత్రలూ రిజిస్టర్ కాలేకపోయాయి. `పేపర్ బాయ్`దీ అదే పరిస్థితి. కాస్టింగ్ విషయంలో దర్శకుడు, నిర్మాతలూ తప్పులు చేశారు. ఇద్దరు హీరోయిన్లలో ఒకరైనా ఫెమీలియర్ అయితే బాగుండేది. సంతోష్ శోభన్ బాగానే చేసినా… ఇలాంటి బలహీనమైన కథని నిలబెట్టేంత బలం తనకు ఇంకా రాలేదనిపిస్తుంది. సౌందర్ రాజన్ ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉన్నా… సంపత్ నంది రాసుకున్న డైలాగులు అబ్బుర పరుస్తున్నా ప్రేక్షకుడికి కిక్ రాకపోవడానికి కారణం… రాంగ్ కాస్టింగ్. ఇదే కథ, ఇదే ఎఫెక్ట్‌తో కాస్త పేరున్న నటీనటులతో తీసుంటే… ఫలితం కచ్చితంగా దక్కేది. సినిమాలొచ్చేశాయ్.. ఫలితాలు తెలిసిపోయాయి. ఇక ఎన్ననుకుని ఏం లాభం? కాకపోతే.. కాస్టింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఈరెండు ఫ్లాపులూ మరోసారి గుర్తు చేశాయంతే.